సిరికొండ: మండల కేంద్రానికి చెందిన పారిపల్లి సాయికుమార్(32) అనే యువకుడు ఆదివారం గ్రామ సమీపంలోని ఎల్లమ్మ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. చెరువులో దూకడం గమనించిన గ్రామస్తులు సాయికుమార్‌ను బయటకు తీసి జీజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడికి రెండు నెలల క్రితం కుమారుడు జన్మించాడు. యువకుడి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతికి గల కారణాలు తెలియరాలేదు.
సిరికొండ: మైలారం గ్రామ శివారులో ఆదివారం మధ్యాహ్నం పిడుగుపాటుకు గేదె మృతి చెందింది. సిరికొండ జీపీ పరిధిలోని సేవాలాల్ తండాకు చెందిన బాదావత్ లింబాద్రి తన గేదెను తండా సమీపంలోని పొలాల వద్ద మేపుతున్నాడు. గేదె మేత మేస్తుండగా దానికి కొద్ది దూరంలో అతడు ఉన్నాడు. వర్షం వచ్చే సమయంలో పిడుగు పడటంతో లింబాద్రి స్పృహ తప్పి పడిపోయాడు. కొద్ది సేపటి తర్వాత అతను కోలుకొని చూసేసరికి గేదె మృతి చెంది ఉన్నట్లు స్థానికులు తెలిపారు. గేదె విలువ రూ. లక్ష వరకు ఉంటుందని, ఆర్థికంగా నష్టపోయిన ఆదుకోవాలని బాధితుడు కోరాడు.
రుద్రూర్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి అదృశ్యమైన ఘటన కోటగిరి మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. కోటగిరి ఎస్సై శ్రీనివాస్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళకు భర్తతో శుక్రవారం గొడవ జరిగింది. అనంతరం తన పుట్టింటికి వెళ్తున్నట్లు చెప్పి ముగ్గురు పిల్లలతో కలిసి ఇంటి నుంచి వెళ్లింది. తర్వాత ఆమె ఆచూకీ లభించకపోవడంతో భర్త ఈ విషయాన్ని ఆమె తండ్రికి సమాచారం ఇచ్చాడు. దీంతో భర్త, మహిళ కుటుంబ సభ్యులతో కలిసి గాలించినా ఆచూకీ లభించలేదు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


