నవీపేట: మండలంలోని ఫతేనగర్ శివారులోని కుంటలో ప్రమాదవశాత్తు మునిగిపోయి ఆదివారం షేక్ అఫాన్(18) అనే యువకుడు మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. బోధన్‌లోని రాకాసిపేట్‌కు చెందిన షేక్ ఫసియొద్దీన్ రెండు నెలల కిందట మండలంలోని ఫతేనగర్ ఫస్ట్‌ప్లాట్‌కు వచ్చి కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు. ఆదివారం సెలవు కావడంతో ఫసియొద్దీన్ కుమారుడు షేక్ అఫాన్ ఇద్దరు స్నేహితులు సోహెల్, అల్తమాస్‌లతో కలిసి శివారులోని కుంటలో సరదాగా స్నానానికి వెళ్లారు. ఈత రాకపోవడంతో షేక్ అఫాన్ నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలుపగా వారు వచ్చి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని బయటకు తీశారు. తండ్రి ఫసియొద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
గాంధారి (ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో గల మొఖరం చెరువులో ప్రమాదవశాత్తు పడి గ్రామానికి చెందిన దొల్లు చిన్న సాయిలు (50) మృతి చెందాడు. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాలు.. సాయిలు కొన్నేళ్ల క్రితం బ్రిడ్జిపై నుంచి వాగులో పడి గాయపడ్డాడు. అప్పటి నుంచి మతిస్థిమితం సరిగ్గా లేదు. శనివారం బయటకు వెళ్లి తిరిగిరాకపోవడంతో బంధువులు అంతటా అతనికోసం వెతికారు. ఆదివారం చెరువులో చిన్న సాయిలు మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుని భార్య దొల్లు లక్ష్మి ఫిర్యాదు మే రకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.


