కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల ప్రధాన రహదారిపై నిర్మించిన డివైడర్లు ప్రమాదకరంగా మారాయి. నాసిరకం పనులతోపాటు నిర్వహణ సరిగా లేక ధ్వంసమవుతున్నాయి. దీంతో కూలిపోయిన డివైడర్ రాళ్లు రోడ్డుపై పడి ప్రమాదకరంగా మారాయి. పట్టణంలోని పాత బస్టాండ్ నుంచి ధర్మశాల, పొట్టి శ్రీరాములు విగ్రహం, రామారెడ్డిరోడ్, రాజీవ్‌పార్క్, అయ్యప్పకమాన్, రాజీవ్ పార్క్ మీదుగా సిరిసిల్లరోడ్ బైపాస్ వరకు 2 కిలో మీటర్ల మేర రహదారి గుండా డివైడర్‌లు ఉన్నాయి. అయితే పనులను నాసిరకంగా చేపట్టడంతో గాలి, వానలతోపాటు వాహనాలు కొద్దిగా తగిలినా ఇవి కూలిపోతున్నాయి. పనుల్లో నాణ్యతను పర్యవేక్షించడంలో మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పొంచి ఉన్న ప్రమాదం..
సిరిసిల్ల రోడ్డులోని వైన్స్ సమీపంలో డివైడర్ పూర్తిగా ధ్వంసమై రాళ్లు రోడ్డుపైకి వచ్చాయి. రాజీవ్ పార్కు ముందు భాగంలో డివైడర్ దెబ్బతింది. రెండు పెట్రోల్ బంక్‌ల ఎదుట కూడా ఇదే పరిస్థితి.. రామేశ్వరపల్లి వైపు వెళ్లే ప్రధాన మలుపు వద్ద డివైడర్ కూలిపోవడంతో.. దానిని గమనించక మలుపు తిరిగే వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాల బారిన పడుతున్నారు. రైస్‌మిల్ సమీపంలోనూ డివైడర్ కూలిపోయి రోడ్డు మధ్యలో ప్రమాదకరంగా మారింది. స్ట్రీట్ లైట్లు సరిగా వెలగని ప్రాంతాల్లో రాత్రి వేళల్లో మరింత ప్రమాదకరంగా మారాయి. కొన్నిచోట్ల వాహనాలు డివైడర్లను ఢీకొన్నప్పుడు విరిగిన భాగాలను అలాగే వదిలేయడంతో అవి రోడ్డును ఆక్రమించాయి. అయినా బల్దియా అధికారులు వాటిని తొలగించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి నాసిరకం పనులపై విచారణ జరపాలని, దెబ్బతిన్న డివైడర్లకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
పట్టణంలోని సిరిసిల్ల రోడ్‌లో కూలిపోతున్న, ధ్వంసమైన డివైడర్లకు మరమ్మతులు చేయిస్తాం. ఈ అంశంపై కౌన్సిల్ సమావేశంలో చర్చించి అవసరమైన నిధులు కేటాయిస్తాం. ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటాం.
– పర్వతాలు, మున్సిపల్ కమిషనర్, కామారెడ్డి
సిరిసిల్లరోడ్‌లోని రైస్‌మిల్ వద్ద..
సిరిసిల్లరోడ్‌లోని పెట్రోల్ బంక్ వద్ద దెబ్బతిన్న డివైడర్
నాసిరకం పనులు..
దెబ్బతింటున్న నిర్మాణాలు
జిల్లాకేంద్రంలోని సిరిసిల్ల రోడ్డులో
ప్రమాదకరంగా పరిస్థితి
పట్టించుకోని పాలకులు


