సాగుకు ‘ఏఐ’ తోడు | - | Sakshi
Sakshi News home page

సాగుకు ‘ఏఐ’ తోడు

Sep 20 2026 1:03 AM | Updated on Sep 20 2026 1:03 AM

ఉపయోగకరంగా ఉంది

బిచ్కుంద: పంట సాగులో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తూ పంట ఉత్పాదకతను పెంచాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)తో కూడిన ‘భారత్‌ విస్తార్‌’ యాప్‌ను తీసుకువచ్చింది. ఈ యాప్‌ వ్యవసాయంలోని ప్రతి దశలో ఓ డిజిటల్‌ వ్యవసాయాధికారిలా సేవలందిస్తోంది. పంటలను ఆశించే చీడపీడలు, తెగుళ్ల పరిష్కారానికి సూచనలు అందించడంతోపాటు ఽపంట ఉత్పత్తుల విక్రయంలోనూ తోడ్పడుతోంది.

సమగ్ర సమాచారం..

సాధారణంగా రైతులు వాతావరణ సమాచారం, మార్కెట్‌ ధరలు, తెగుళ్ల నివారణ, సాగు విధానం, ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకోవడానికి వివిధ శాఖల అధికారులు, కార్యాలయాలను సంప్రదిస్తారు. ఈ సేవలన్నింటినీ ఒకే వేదికపై అందించేందుకు కేంద్రం యాప్‌ను తీసుకువచ్చింది. ‘భారత్‌ విస్తార్‌’ యాప్‌తో ఆయా సమాచారం తెలుసుకునే వీలుంది. పైరును చీడపీడలు ఆశించినప్పుడు, పోషకాల లోపాలు ఉన్నప్పుడు వాటి ఫొటోలు తీసి సమస్యను వివరించి యాప్‌లో అప్‌లోడ్‌ చేయగానే ఆ చిత్రాల ఆధారంగా పంటకు వచ్చిన తెగుళ్లు, పంట ఎదుగుదల, చీడపీడల నివారణకు ఏ పురుగు మందులు వాడాలి, ఎంత పరిమాణంలో మందులు పిచికారీ చేయాలనే సూచనలను అందిస్తుంది. అలాగే ఉత్పత్తులను ఏ మార్కెట్‌లో అమ్మితే గిట్టుబాటు ధర లభిస్తుంది, వివిధ రకాల పంటల ధరలు, ఏ కాలంలో ఏ పంటలు వేస్తే లాభదాయకంగా ఉంటుందనే సమాచారం కూడా అందిస్తుంది. కాగా ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఈ యాప్‌పై రైతులకు అవగాహన కల్పించే విషయమై వ్యవసాయ శాఖ దృష్టి సారించడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి భారత్‌ విస్తార్‌ యాప్‌పై రైతులకు అవగాహన కల్పించాలని యువ రైతులు కోరుతున్నారు.

‘భారత్‌ విస్తార్‌’ యాప్‌ రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంది. తెగుళ్లు, పురుగులు ఆశించకుండా నివారణ చర్యలు, ఎలాంటి మందులు వాడాలి, ఉత్పత్తుల విక్రయాలు తదితర సమాచారాన్ని తెలుసుకోవచ్చు. యాప్‌పై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఏఐ ఇచ్చే సూచనను తుది నిర్ణయంగా కాకుండా వ్యవసాయ నిపుణుల సలహాలు కూడా తీసుకోవడం మంచిది.

– అమర్‌ ప్రసాద్‌, ఏవో బిచ్కుంద

డిజిటల్‌ వ్యవసాయ అధికారిగా

‘భారత్‌ విస్తార్‌’ యాప్‌

అవగాహన లేక

వినియోగించుకోలేకపోతున్న రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement