● క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్న అధికారులు
● దళారులను నమ్మి మోసపోవద్దని సూచన
కామారెడ్డి టౌన్ : చేయూత పెన్షన్ల కోసం జిల్లాలో 14,570 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో అర్హులను గుర్తించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 1.55 లక్షల మంది చేయూత పింఛన్ల ద్వారా లబ్ధి పొందుతున్నారు. వీరికోసం ప్రభుత్వం ప్రతినెలా రూ.37.61 కోట్లను వెచ్చిస్తోంది. కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే వృద్ధాప్య పెన్షన్లు, బీడీ కార్మికుల జీవన భృతి కాకుండా.. మిగతా పెన్షన్లకోసం మాత్రమే ఈనెల 16 వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఆయా పింఛన్ల కోసం జిల్లాలో 14,570 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో అర్హులను తేల్చే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది.
కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ మొదలవడంతో దళారులు రంగంలోకి దిగి అమాయక ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తున్నారు. పింఛన్ మంజూరు చేయిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పింఛన్ల కోసం ఎవరూ దళారులను ఆశ్రయించవద్దని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అర్హులను ఎంపిక చేస్తామని, ఎవరికీ రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాతే దరఖాస్తులు ఆమోదం పొందుతాయని, ఇందులో ఎవరి ప్రమేయం ఉండదని పేర్కొంటున్నారు. ఎవరైనా పింఛన్ ఇప్పిస్తామని వస్తే సంబంధిత మున్సిపల్, మండల అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.


