సమస్య ఉన్న గ్రామాలు..
మూడు మండలాల్లో హియరింగ్ ఇలా...
సిగ్నల్ ఎక్కడుంటే..
● ఓటర్ల వివరాల ఆన్‌లైన్‌కు ఇబ్బందులు
● నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాలకు
వెళ్తున్న ఎన్నికల సిబ్బంది
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)లో భాగంగా అనామలిస్ జాబితాలో ఉన్న వారికి నోటీసులు జారీ చేసి, వారిచ్చే ఆధారాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి ఎన్నికల సిబ్బందికి సిగ్నల్ సమస్య ఇబ్బందికరంగా మారింది. కామారెడ్డి జిల్లాలోని మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన జుక్కల్ నియోజకవర్గం పరిధిలో ఉన్న జుక్కల్, పెద్దకొడప్‌గల్, డోంగ్లీ తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దీంతో ఓటర్ల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి నానా పాట్లు పడుతున్నారు. గ్రామంలో సెల్‌ఫోన్ సిగ్నల్ ఎక్కడుంటే అక్కడికి ఓటర్లను తీసుకువెళ్లి వారి ఫొటోలు తీసుకుంటూ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. మరికొన్నిచోట్ల ఓటర్లను మండల కేంద్రానికి, పక్క ఊరుకు తీసుకువెళ్తున్నారు. ఇంకొన్ని చోట్ల ఓటర్ల వివరాలను ఫొటో తీసుకుని సిగ్నల్ వచ్చిన చోటుకు వెళ్లి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.
జుక్కల్ నియోజక వర్గంలోని కొన్ని గ్రామాల్లో నెట్వర్క్ సమస్యతో ఓటర్ల వివరాలను నమోదు చేసుకోవడానికి ఇబ్బంది అవుతోంది. అయినా సిబ్బంది బాధ్యతగా పనిచేస్తూ నోటీసులు అందుకున్న వారి నుంచి ఆధారాలు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి కష్టపడుతున్నారు. సిగ్నల్ ఎక్కడ వస్తే అక్కడికి తీసుకువెళ్లి వివరాలను నమోదు చేయిస్తున్నారు.
– విక్టర్, అదనపు కలెక్టర్(రెవెన్యూ), కామారెడ్డి
పెద్దకొడప్‌గల్ మండలంలోని పెద్దదేవిసింగ్ తండాలో సిగ్నల్ రాకపోవడంతో అక్కడి ఓటర్లను వడ్లం శివారు ప్రాంతానికి తీసుకువెళ్లి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.
పోచారం తండాకు చెందిన ఓటర్లను పెద్దకొడప్‌గల్ తహసీల్ కార్యాలయానికి, తబ్దల్ గ్రామం నుంచి ఓటర్లను చిన్నతక్కడ్‌పల్లికి తీసుకువెళ్తున్నారు.
జుక్కల్ మండలం చండేగావ్, మాదాపూర్, హంగర్గ గ్రామాలలో సిగ్నల్ ఉన్న ప్రాంతానికి ఓటర్లను రప్పించి సర్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. డోంగ్లీ మండలం సిర్‌పూర్, డోంగ్లీ, మొగ, మల్లాపూర్, పెద్దకొడప్‌గల్ మండలంలోని బాబుల్‌గావ్, విఠల్‌వాడీ, లింగంపల్లి, బూరుగుపల్లి, అంజని, శివాపూర్ తదితర గ్రామాల్లో సిగ్నల్స్ సమస్య తీవ్రంగా ఉంది.
పెద్దకొడప్‌గల్ మండలంలో 27 పోలింగ్ బూత్‌ల పరిధిలో 145 మంది ఓటర్ల వివరాలు మ్యాపింగ్ కాలేదు. 6,146 మంది ఓటర్ల వివరాల్లో తేడాలున్నాయి. 6,289 మందికి నోటీసులు సిద్ధం చేసి, 3,937 మందికి నోటీసులు జారీ చేశారు. ఇంకా 2,352 మందికి నోటీసులు ఇవ్వాల్సి ఉంది. 2,004 మంది ఓటర్ల హియరింగ్ పూర్తయ్యింది.
డోంగ్లీ మండలంలో 18 పోలింగ్ బూత్‌ల పరిధిలో 260 మంది ఓటర్ల మ్యాపింగ్ జరగలేదు. 4,781 మంది ఓటర్లను అనామలిస్ జాబితాలో చేర్చారు. 5,043 మంది ఓటర్లకు నోటీసులు సిద్ధం చేసి, 4,710 మందికి నోటీసులు జారీ చేశారు. 333 మంది నోటీసులు పెండింగులో ఉన్నాయి. 4,211 మంది ఓటర్ల హియరింగ్ పూర్తయ్యింది.
జుక్కల్ మండలంలో 50 పోలింగ్ బూత్‌ల పరిధిలో 424 ఓట్లు మ్యాపింగ్ కాకపోవడం, 11,232 మంది ఓటర్ల వివరాల్లో తేడాలుండడంతో అనామలిస్ జాబితాలో ఉంచారు. మొత్తంగా 11,656 మంది ఓటర్లకు నోటీసులు రెడీ చేయగా.. 11,205 మందికి నోటీసులు జారీ చేశారు. ఇంకా 452 మందికి నోటీసులు పెండింగులో ఉన్నాయి. 5,583 మంది ఓటర్ల హియరింగ్ పూర్తయ్యింది.


