కామారెడ్డి క్రైం: గణేశ్ విగ్రహాల నిమజ్జనోత్సవాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. పట్టణంలోని పాత బస్టాండ్ పోలీస్ బూత్‌లో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ గణపతిని బుధవారం ఆయన ఎస్పీ రాజేశ్‌చంద్రతో కలిసి, దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులు, గణేశ్ ఉత్సవ సమితుల ప్రతినిధులతో కలిసి ప్రత్యేక బస్సులో శోభాయాత్ర రూట్‌మ్యాప్‌ను పరిశీలించారు. శోభాయాత్ర మార్గంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. నిమజ్జన ప్రదేశాల్లో గజ ఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు, వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచాలన్నారు. సంప్రదాయ పద్ధతిలో గణేశ్ ఉత్సవాలు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. శోభాయాత్ర జరిగే దారిలో రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళికను అమలు చేయడంతో పాటు, సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ చర్యలు చేపడతామని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఉమారాణి, అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, అదనపు కలెక్టర్ గిరి, డీఎస్పీ మధుసూదన్, పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి తదితరులున్నారు.


