● ఎస్పీ రాజేశ్ చంద్ర
కామారెడ్డి క్రైం: సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దని ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. డీజేలకు అనుమతులు లేకపోవడంతో డప్పు కళాకారులను గౌరవిస్తూ, వారిని ప్రోత్సహిస్తూ వేడుకలు జరుపుకోవాలన్నారు. పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయం నుంచి అన్ని పీఎస్‌ల ఎస్‌హెచ్‌వోలతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నెలవారీ సమావేశం, గణేష్ నవరాత్రి ఉత్సవాల భద్రతపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి గణేష్ మండపాన్ని పోలీస్ అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా రోజూ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించాలన్నారు. నిమజ్జనాలు నిర్వహించే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ఆయా ప్రాంతాల్లో అవసరమైన పోలీస్ బందోబస్తు, గస్తీ, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. డీజేలకు అనుమతులు లేవన్నారు. జిల్లాలో ఇప్పటికే 3 చోట్ల డీజేలపై కేసులు నమోదు చేసి వాటిని స్వా ధీనం చేసుకున్నామన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి సోషల్ మీడియాపై ప్రత్యేకంగా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. ప్రజలు ఏదైనా అనుమానాస్పద లేదా వివాదాస్పద సమాచారాన్ని గమనించినప్పుడు దానిని ఫార్వర్డ్ చేయకుండా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. వీసీలో డీఎస్పీలు మధుసూదన్, శ్రీనివాసరావు, విఠల్‌రెడ్డి, గట్టుమల్లు, ఎస్బీ సీఐ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.


