● జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క
● భూకోన్‌పల్లి హనుమాన్
ఆలయాభివృద్ధి పనులకు శంకుస్థాపన
● రూ. 50 లక్షలు మంజూరు
కామారెడ్డి రూరల్: ప్రభుత్వం ఆలయాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని సరంపల్లి గ్రామ శివారులో ఉన్న భూకోన్‌పల్లి ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఆలయంలో స్వామివారికి మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ..ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.50 లక్షలు మంజూరు చేసిందన్నారు. పనులు నాణ్యతో చేపట్టి త్వరితగతిన ఆలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ అశిష్ సంగ్వాన్, మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి, డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్, డీసీసీ మాజీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు సందీప్, మండల అధ్యక్షుడు ధర్మగోని రాజాగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ గూడెం శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక కౌన్సిలర్ నిట్టు గంగాధర్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు భూమని బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతి
కామారెడ్డి టౌన్ : బల్దియా సమగ్ర అభివృద్ధి, ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థ పునరుద్ధరణకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా,శిశు శాఖ మంత్రి అనసూయ (సీతక్క)ను కోరారు. ఈ మేరకు మంగళవారం జిల్లా పర్యటనలో మంత్రికి వినతిపత్రం అందజేశారు. డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో వర్షపు నీరు నిలిచి కాలనీలు ముంపునకు గురవుతున్నాయన్నారు. రోడ్ల మరమ్మతులు, పునర్నిర్మాణానికి రూ.10 కోట్లు, వరద నీరు సాఫీగా వెళ్లేందుకు అవసరమైన సీసీ డ్రైన్ల నిర్మాణానికి మరో రూ.10 కోట్లు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు. జిల్లా కేంద్రంలో ఇంజినీరింగ్, లా, నర్సింగ్, పాలిటెక్నిక్ కళాశాలలతో పాటు స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పట్టణ సుందరీకరణలో భాగంగా క్లాక్ టవర్లు, వెల్‌కమ్ ఆర్చ్‌ల నిర్మాణం, విద్యుత్ ఆదా కోసం సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు ప్రభుత్వ నిధులు మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు. మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించి, ప్రభుత్వపరంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
భిక్కనూరు సర్పంచ్..
భిక్కనూరు: మండలకేంద్రం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని భిక్కనూరు సర్పంచ్ రేఖ మంత్రి సీతక్క ను కలిసి విన్నవించుకున్నారు. మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పట్టణంలో మౌలిక వసతుల కల్పన కోసం కావలసిన నిధులు మంజూరు చేయాలని కోరారు. సిద్ధిరామేశ్వర ఆలయ పునర్ నిర్మాణ కమిటీ చైర్మన్ లింబాద్రి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి రాజబాబు గౌడ్, మండలం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్ ఉన్నారు.


