నస్రుల్లాబాద్: సైకిల్, బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై రాఘవేంద్ర తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామానికి చెందిన పాషా(61) సోమవారం రాత్రి రోడ్డు గుండా సైకిల్‌పై బాన్సువాడకు వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన బైక్ ఢీకొన్నది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ పాషాను కుటుంబీకులు మొదట బాన్సువాడకు ఆ తర్వాత హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. బైక్ నడుపుతున్న వాజీద్‌నగర్‌కు చెందిన కులకర్ణి వంశీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
భిక్కనూరు: యాసిడ్ గాయాలకు గురైన ఓ వివాహిత చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. భిక్కనూరుకు చెందిన దివ్యవాణి(33)కి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన అరవింద్‌తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. అత్తింట్లో తరచూ గొడవలు జరుగుతుండడంతో ఇటీవల పిల్లలతో కలిసి పుట్టింటికి వచ్చింది. ఈ నెల 11న రాత్రి ఒంటరిగా బయటకు వెళ్లిన ఆమె ఆదివారం సాయంత్రం జంగంపల్లి శివారులో యాసిడ్ గాయాలతో ప్రత్యక్షమైంది. కుటుంబీకులు వెంటనే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం అంత్యక్రియలు జరిగాయి. మృతురాలి తండ్రి మధుసూదన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్ తెలిపారు.
నస్రుల్లాబాద్: మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం సోమల్గల్ తండాకు చెందిన అజ్మీర్ కిషన్ అనే వ్యక్తి పెట్రోల్ బంక్ సమీపంలో బైక్‌పై ప్రయాణిస్తున్న సమయంలో ఇతర వాహనాలు స్పీడ్ గా రావడంతో కిషన్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్నాడు. ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక కాలు విరిగింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది కిషన్‌ను బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
డీజే నిర్వాహకుడిపై కేసు నమోదు
కామారెడ్డి రూరల్: అనుమతి లేకుండా డీజేను ఏర్పాటు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రంజిత్ మంగళవారం తెలిపారు. కామారెడ్డి మండలం శాబ్దిపూర్ తండాలో వినాయక ప్రతిష్ఠాపనలో అనుమతి లేకుండా డీజే ఏర్పాటు చేసినందుకు యజమానిపై కేసు నమోదు చేసి డీజేను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.
సదాశివనగర్: మండలంలోని కుప్రియాల్ శివారులో పేకాట స్థావరంపై దాడి చేసినట్లు ఎస్సై పుష్పరాజ్ మంగళవారం తెలిపారు. గ్రామంలోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో దాడి చేశామన్నారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకోగా వారి నుంచి రూ. 2,080 నగదు, నాలుగు సెల్ ఫోన్స్, నాలుగు బైక్‌లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


