గాంధారి/ కామారెడ్డి అర్బన్: మండల పరిధిలోని నర్సాపూర్ రైతును ఫోన్‌లో అసభ్య పదజాలంతో దూషించి బెదిరించిన మండల వ్యవసాయాధికారి రాజలింగంపై చర్యలు తీసుకోవాలని జాతీయ కిసాన్ సంఘ్ నాయకులు బాధిత రైతు రవితో కలిసి సంబంధిత అధికారులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. సంఘ్ నాయకుడు శంకర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు రవి ఏవో రాజలింగానికి ఆదివారం రోజున సాయంత్రం ఫోన్ చేసి తనకు చెందిన ఓ సర్వే నంబరు భూమికి యూరియా రావడం లేదని యూరియా ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరాడు. ఏవో పొంతన లేని సమాధానాలు చెప్పి పెట్టేశాడు. రవి మళ్లీ ఫోన్ చేయడంతో అసభ్యపాదజాలంతో దూషించి, బెదిరించాడు. అధికారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో, జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయం, అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఏవో రాజలింగాన్ని ‘సాక్షి’ వివరణ కోరగా ఆదివారం రాత్రి రైతు రవి ఫోన్ చేసి బీమా కాలేదని తెలిపాడు. అందరితో పాటు నీది కూడా అవుతుందని చెప్పినా పదే పదే ఫోన్ చేస్తూ అతనే అమర్యాదగా మాట్లాడి దూషించి ఫోన్ పెట్టేశాడు. మళ్లీ నేను ఫోన్ చేయగా తాను మాట్లాడింది మాత్రమే రికార్డు చేసి వైరల్ చేశాడని తెలిపారు.


