రెయిన్‌ డౌన్‌ఫాల్‌! | - | Sakshi
Sakshi News home page

రెయిన్‌ డౌన్‌ఫాల్‌!

Sep 9 2026 3:10 AM | Updated on Sep 9 2026 3:10 AM

రెయిన్‌ డౌన్‌ఫాల్‌! పెరగని భూగర్భ జలాలు..

ఆరు‘తడి’కి ఇబ్బందే...

వరుణుడు ముఖం చాటేయడంతో పక్షం రోజులుగా సరైన వర్షాలు కురియడం లేదు. దీంతో జిల్లాలో వర్షపాతం అధికం నుంచి సాధారణానికి పడిపోయింది. అరకొరగానే వానలు కురియడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

ల్‌నినో ప్రభావంతో ఈ సీజన్‌లో రాష్ట్రం అంతటా సరైన వర్షాలు లేకపోవడంతో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యింది. కామారెడ్డి జిల్లాలో మాత్రం ఆలస్యంగానైనా గతనెలలో వర్షాలు కురిశాయి. దీంతో మొన్నటి దాకా సాధారణం కన్నా ముప్పై శాతం అధిక వర్షపాతం రికార్డయ్యింది. జిల్లాలో ప్రాజెక్టులు, చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయి. అయితే పదిహేను రోజులుగా వరుణుడి కరుణ లేకపోవడంతో అక్కడక్కడ చిరుజల్లులే తప్ప పెద్ద వర్షాలు కురవలేదు. దీంతో వర్షపాతం లెక్కలు తారుమారవుతున్నాయి. జిల్లాలో గతనెల 24 నుంచి ఈనెల 8 వరకు అంటే పక్షం రోజుల్లో సరాసరి వర్షపాతం 119.8 మి.మీ. నమోదు కావాల్సి ఉండగా.. 68.0 మి.మీ. మాత్రమే వర్షం కురిసింది. అంటే 43 శాతం తక్కువ వర్షాలు పడ్డాయి. మొన్నటి దాకా 30 శాతం అదనంగా ఉన్న వర్షపాతం ఇప్పుడు సాధారణానికి పడిపోయింది. ఇంకో నాలుగు రోజులు పరిస్థితులు ఇలాగే ఉంటే లోటులోకి వెళ్లే అవకాశం ఉంది.

18 మండలాల్లో..

వర్షకాలం సీజన్‌ ఆరంభమయ్యే జూన్‌ 1 నుంచి నేటి వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 708.5 మి.మీటర్లు కాగా.. 851.1 మి.మీ. వర్షం కురిసింది. ఆరు మండలాల్లో సాధారణం కన్నా కాస్త ఎక్కువ వర్షపాతం నమోదవ్వగా ఒక మండలంలో 22 శాతం లోటు రికార్డయ్యింది. మిగతా 18 మండలాల్లో ఇప్పటికై తే సాధారణంగా ఉంది.

మొన్నటివరకు మురిపించిన వరుణుడు ముఖం చాటేయడంతో మెట్ట రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షంపై ఆధారపడి సాగు చేసిన పత్తి, మక్క, సోయా, కంది తదితర ఆరుతడి పంటలకు కీలకమైన సమయంలో వర్షాలు కురవకపోవడం ఇబ్బందికరంగా మారింది. ఆయా పంటలకు వచ్చే పక్షం రోజులు ఎంతో కీలకమైనవి. ఈ సమయంలో ఒకటి రెండు వర్షాలు కురిస్తే ఎంతో మేలు జరుగుతుంది. లేదంటే పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

జిల్లాలో గతనెలలో భారీ వర్షలు కురిసి వాగులు పొంగి ప్రవహించినప్పటికీ భూగర్భ జలమట్టం గతేడాదితో పోలిస్తే తక్కువగానే ఉంది. గతేడాది ఆగస్టు చివరలో జిల్లా సగటు భూగర్భ జలమట్టం 8.90 మీటర్లు కాగా.. ఈసారి 9.04 మీటర్లుగా ఉంది. తాడ్వాయి మండలం కన్కల్‌లో 23.79 మీటర్లు, దోమకొండ మండలం అంచనూరులో 22.12 మీటర్లు, బిచ్కుంద మండలం గోద్మెగాంలో 20.03, బీబీపేటలో 19.33, లింగంపేట మండలం కన్నాపూర్‌లో 17.07, దోమకొండలో 16.89, భిక్కనూరు మండలం మల్లుపల్లిలో 16.70, గాంధారి మండలం గుర్జాల్‌లో 16.70, నాగిరెడ్డిపేట మండలం వదల్‌పర్తిలో 16.63, అడ్లూర్‌లో 16.25, నాగిరెడ్డిపేట మండలం బంజరలో 15.58, రాజంపేట మండలం సిద్దాపూర్‌లో 15.40 మీటర్ల లోతులో నీరుంది. పక్షం రోజులుగా వర్షాలు లేకపోవడం, ఎండలు కూడా మండుతుండడం, దీనికి తోడు నీటి వాడకం పెరిగిన నేపథ్యంలో భూగర్భ జలమట్టం మరింత తగ్గిపోయి పంటలు దెబ్బతినే ప్రమాదం ఉంది.

పక్షం రోజులుగా

ముఖం చాటేసిన వరుణుడు

ఎక్సెస్‌ నుంచి నార్మల్‌కు

పడిపోయిన వర్షపాతం

దాదాపు అన్ని మండలాల్లోనూ

ఇదే పరిస్థితి

ఆందోళనలో అన్నదాతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement