జిల్లా కేంద్రంలో మరో రైల్వే వంతెన నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. అశోక్‌నగర్‌లో రోడ్డుకు ఇరువైపులా స్థల సేకరణ నిమిత్తం కొలతలు తీశారు. సుమారు కిలోమీటరు మేర వందకుపైగా ఇళ్లకు నష్టం జరిగే అవకాశాలు ఉండడంతో వాటి యజమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలోని స్నేహపురి కాలనీ, వికాస్‌నగర్‌తో పాటు పాతరాజంపేట వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జీలు నిర్మించాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే స్నేహపురి కాలనీ నుంచి కలెక్టరేట్‌వైపు వంతెన నిర్మించే అంశాన్ని గతంలో పరిశీలించారు. అక్కడే నిర్మాణం జరుగుతుందని అందరూ భావించారు. కానీ ఇటీవల రైల్వే అధికారులు ప్రస్తుతం రైల్వే గేటు ఉన్న అశోక్‌నగర్ ప్రాంతంలోనే వంతెన నిర్మించేందుకు సాయిల్ టెస్ట్ నిర్వహించారు. తాజాగా ప్రస్తుతం ఉన్న రోడ్డును ఏ మేరకు విస్తరించాలన్న దానిపై కొలతలు వేసి మార్కింగ్ ఇచ్చారు. గేటు నుంచి అశోక్‌నగర్ వైపు అరవై ఇళ్లకుపైగా నష్టం జరిగే అవకాశం ఉంది. 15 ఫీట్ల నుంచి 20 ఫీట్ల వరకు విస్తరణలో పోనున్నాయి. అలాగే గేటు అవతల కేపీఆర్ కాలనీలో కూడా అదే స్థాయిలో ఇళ్లకు నష్టం జరిగే అవకాశాలున్నట్టు స్పష్టమవుతోంది.
త్వరలో డబ్లింగ్ పనులు..
జిల్లా కేంద్రంలో రైల్వే డబుల్ లైన్ పనులు కూడా త్వరలోనే మొదలుకానున్నాయి. డబుల్ లైన్‌కు తోడు స్టేషన్ కూడా అశోక్‌నగర్ గేటుకు సమీపంలో ఉండడంతో ఎక్కువ ఎత్తు, ఎక్కువ పొడవుతో ఆర్వోబీని నిర్మించే అవకాశాలున్నాయి. దీంతో ఇరువైపులా పెద్ద ఎత్తున ఇళ్లకు నష్టం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం మార్కింగ్ ఇచ్చిన వాటిని పరిశీలిస్తే కొందరు ఇళ్లను పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఉంది. ఇళ్లు, స్థలాలు కోల్పోయిన వారికి పరిహారం చెల్లించడం, వంతెన నిర్మాణానికి దాదాపు రూ.2 వందల కోట్లు ఖర్చవుతుందని భావిస్తున్నారు.
వంతెన నిర్మాణ స్థలం మార్చాలంటూ..
రైల్వే అధికారులు కొలతలు వేసి మార్కింగ్ చేయడంతో ఇళ్ల యజమానులు ఆందోళన చెందుతున్నారు. వాసవి స్కూల్ చౌరస్తా ప్రాంతంలో అయితే కొందరు తమ ఇళ్లను పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఉంది. గేటు నుంచి ఇల్చిపూర్ రోడ్డు వరకు ఇరువైపులా భారీగానే నష్టం వాటిల్లుతుంది. అలాగే గేటు నుంచి కేపీఆర్ కాలనీ వైపు కూడా ఇదే పరిస్థితి.. రైల్వే అధి కారులు మార్కింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఏం చేయాల న్న దానిపై ఇళ్ల యజమానులు చర్చించుకుంటున్నా రు. అశోక్‌నగర్‌లో వంతెన నిర్మిస్తే తాము రోడ్డున పడుతామని ఆందోళన చెందుతున్నవారు ప్రజాప్రతినిధులను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. ఇళ్లు ఉన్న ప్రాంతంలో కాకుండా తక్కువ నష్టం జరిగే చోట ఆర్వోబీ నిర్మించాలని కోరుతున్నారు.
అశోక్‌నగర్ రోడ్డుకు ఇరువైపులా
స్థల సేకరణకు మార్కింగ్
వందకుపైగా ఇళ్లకు
నష్టం జరిగే అవకాశం
ఆందోళనలో ఇళ్ల యజమానులు


