నిజామాబాద్ అర్బన్: జిల్లాలో చేపడుతున్న భూముల రీ సర్వేపై రైతులు ఏమంటున్నారని, ప్రభుత్వంపై వారి అభిప్రాయం ఎలా ఉందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలో శనివారం పర్యటించిన మంత్రి.. రెవెన్యూ అంశాలు, గృహ నిర్మాణ కార్యక్రమాలపై ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అధికారులతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. భూభారతి సదస్సులు సాదా బైనమా ఆర్జీలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలను ఇబ్బంది పెడితే ఎంతటి వారిన ఉపేక్షించేది లేదని మంత్రి తేల్చి చెప్పారు. రీ సర్వే కొనసాగుతున్న గ్రామాల్లో తహసీల్దార్లు తప్పనిసరిగా పాల్గొనాలని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రీ సర్వేను ఏడాదిలోగా కచ్చితంగా పూర్తి చేయాలని, లైసెన్డ్స్ సర్వేయర్ల సేవలు వినియోగించుకోవాలన్నారు. ప్రజల కోసమే తమ ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని, వారికి జవాబుదారీగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సర్వే, రిజిస్ట్రేషన్‌లపై సమాధానం చెప్పడంలో తడబడిన ఇందల్‌వాయి తహసీల్దార్‌ను మంత్రి దగ్గరికి పిలుచుకుని వివరాలు తెలుసుకున్నారు. ఓ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ను ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశించిన మంత్రి.. ఆ అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. జక్రాన్‌పల్లి మండలం పరిధిలో ఫారెస్ట్‌కు సంబంధించిన భూ వివాదం గురించి తెలుసుకున్నారు. అలాగే నిజామాబాద్ రూరల్ తహసీల్దార్‌తో మాట్లాడి అసైన్‌మెంట్ భూముల వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో రీ సర్వేలో కలెక్టర్లు రెవెన్యూ అధికారులు పాల్గొని అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించాలి
దరఖాస్తుల పెండింగ్ సరికాదు
ప్రజలను ఇబ్బంది పెడితే ఉపేక్షించేది లేదు
పలువురు రెవెన్యూ అధికారులపై
మంత్రి పొంగులేటి ఆగ్రహం
రెవెన్యూ, గృహ నిర్మాణ
కార్యక్రమాలపై సమీక్ష
కలెక్టరేట్ సమీపంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను తక్షణమే పూర్తి చేసి హౌసింగ్ శాఖకు అప్పగించాలని సంబంధిత శాఖ అధికారులు ఆదేశించారు. పెండింగ్ పనులను తక్షణమే పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. నిధుల కొరత లేదని పనులు పూర్తయిన 24 గంటల్లోనే బిల్లులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.
సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహదారులు సుదర్శన్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, ధన్‌పాల్ సూర్యనారయణ, పైడి రాకేశ్‌రెడ్డి, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ లోకేశ్‌కుమార్, స్పెషల్ సెక్రెటరీ రాజీవ్‌గాంధీ హనుమంతు, గృహనిర్మాణ సంస్థ ఎండీ గౌతమ్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు భవేశ్ మిశ్రా, ఆశిష్ సంగ్వాన్ తదితరులు పాల్గొన్నారు.


