ముఖ్య నేతల ఆశీస్సులున్నోళ్లకే అవకాశం
అందరి దృష్టి విండోలపైనే...
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీసీఎస్) పాలకవర్గాల పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం ఆరు నెలల కోసమంటూ నామినేటెడ్ పద్ధతిలో చైర్మన్, డైరెక్టర్లను నియమిస్తోంది. అధికార పార్టీకి చెందిన నేతలకు ఇది మంచి అవకాశంగా మారింది. జిల్లాలో 55 సహకార సంఘాలు ఉండగా, అన్నిచోట్లా చైర్మన్, డైరెక్టర్ పదవుల కోసం పలువురు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో పలు విండోల పాలకవర్గాల నియామకానికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఇందులో కామారెడ్డి, తిప్పాపూర్ విండోలకు లైన్ క్లియర్ అయి నియామకపు ఉత్తర్వులు అందుకున్నారు. జుక్కల్ నియోజకవర్గంలో కొన్నింటికి ప్రతిపాదనలు పంపారు. బాన్సువాడలో కసరత్తు జరుగుతోంది. ఒక్కో విండో చైర్మన్, 12 మంది డైరెక్టర్లకు అవకాశం ఉంది. చైర్మన్ పదవి కోసం చాలాచోట్ల తీవ్ర పోటీ నెలకొంది. అధికార పార్టీకి చెందిన నేతలు నియోజకవర్గ ముఖ్య నేతలను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని వేడుకుంటున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ సిఫారసు చేసిన వారికి పదవులు దక్కనుండటంతో ఆయా విండోల పరిఽధిలోని కాంగ్రెస్ నాయకులు తమకు అవకాశం ఇవ్వాలంటూ షబ్బీర్‌అలీ వద్దకు పరుగులు తీస్తున్నారు. కామారెడ్డి విండో చైర్మన్‌గా షబ్బీర్‌అలీ అంతరంగికుల్లో ఒకరైన చిందాల(గూడెం) శ్రీనివాస్‌రెడ్డికి అవకాశం దక్కింది. తిప్పాపూర్ చైర్మన్‌గా మొన్నటి వరకు భిక్కనూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన తిరుపారి భీంరెడ్డిని నియమించారు. మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట, ముత్యంపేట, రామేశ్వర్‌పల్లి, భిక్కనూరు, రాజంపేట, బస్వాపూర్, అంతంపల్లి తదితర సహకార సంఘాల చైర్మన్ పదవులను చాలా మంది ఆశిస్తున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పలువురు నేతలు ఎమ్మెల్యే మదన్‌మోహన్ ఆశీర్వాదం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొన్నింటిని ఇప్పటికే ఖరారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు సమాచారం. జుక్కల్‌లో సహకార పదవుల కోసం స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావ్‌ను కలిశారు. బాన్సువాడ నియోజకవర్గంలోని ఆయా సొసైటీ చైర్మన్ పదవులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఖరారు చేయనున్నారు.
విండో చైర్మన్, డైరెక్టర్ పదవులు ఆయా నియోజకవర్గాలకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే/ముఖ్య నేతల ఆశీస్సులు ఉన్నవారికే దక్కనున్నాయి. దీంతో ఆశావహులు తమకు అవకాశం ఇవ్వాలని వారిని కలిసి వేడుకుంటున్నారు. అయితే, దశాబ్దాల కాలంగా పార్టీలో పనిచేస్తున్న వారిలో కొందరు తమకు అవకాశం ఇవ్వకుంటే పార్టీకి గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నారు. కొన్నిచోట్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన వారికి అవకాశాలు ఇస్తే ఊరుకునేది లేదని కూడా పేర్కొంటున్నారు. విండో చైర్మన్ పదవి ద్వారా రాజకీయంగా ఎదగడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్న నేతలు ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనుకాడడం లేదన్న ప్రచారం జరగుతోంది.
మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆరాటపడిన వారు ఎన్నికలు వాయిదాపడుతూ రావడంతో నిరాశ చెందారు. అయితే, ఎన్నికల ప్రక్రియ లేకుండానే నామినేట్ చేస్తుండటంతో సహకార సంఘాల పదవులను పొందాలని కొందరు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎన్నికల లొల్లి లేకుండా నియమిస్తుండటం చాలా మందిని ఆలోచనల్లో పడేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో విండో చైర్మన్, డైరెక్టర్ పదవులకు డిమాండ్ పెరిగింది. ధాన్యం కొనుగోళ్లు, ఎరువుల విక్రయాలతో విండోలకు ఆదాయం విపరీతంగా పెరిగింది. పాలకవర్గాలకు నాలుగుచేతులా సంపాదించుకునే అవకాశం దొరికింది. దీంతో కొందరు విండో చైర్మన్ పదవుల కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదని తెలుస్తోంది. కొన్ని విండోల్లో చైర్మన్ కోసం బేరసారాలు కూడా చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆరు నెలల కోసం ఇచ్చినా, విండోల ఎన్నికలు వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఆరు నెలల చొప్పున పొడిగిస్తారన్న భావనతో చాలామంది విండో పదవులకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
చైర్మన్, డైరెక్టర్ పదవులకు
ప్రయత్నాలు
జిల్లాలో 55 విండోలు..
ఇప్పటికే కొన్నింటికి ప్రతిపాదనలు
రెండు విండోలకు
పాలకవర్గాలు ఖరారు
ముఖ్య నేతల చుట్టూ
ఆశావహుల చక్కర్లు


