● తల్లిదండ్రుల పాలరాతి
విగ్రహాల ఆవిష్కరణ
● చాట్ల నర్సయ్య సాహితీ సేవలు
కొనియాడిన రచయితలు, కవులు
రామారెడ్డి(ఎల్లారెడ్డి): బతికుండగానే తల్లిదండ్రులను వదిలేస్తున్నారు కొందరు... అంత్యక్రియలకు కూడా హాజరుకాకుండా వీడియో కాల్స్‌లోనే చివరి మజిలీ పూర్తి చేస్తున్నారు మరికొందరు పిల్లలు. అలాంటిది మరణించిన తల్లిదండ్రులను నిత్యం గుర్తు చేసుకు నేలా పాలరాతి విగ్రహాలు చేయించి ఆదివారం ఆవిష్కరించారు. రామారెడ్డి మండలం పోసానిపేటలోని వ్యవసాయ క్షేత్రంలో బహుముఖ ప్రజ్ఞాశాలి చాట్ల న ర్సయ్యగంగామణి విగ్రహాలను కొడుకులు చాట్ల విజ యకృష్ణ, విశ్వ ప్రమోద్, చాట్ల విద్యుల్లత ప్రతిష్టించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ తండ్రి చాట్ల నర్సయ్య చరిత్ర పరిశోధకుడిగా, కళాకారుడిగా, రంగస్థల నటుడిగా, కవిగా, రచయితగా సాహితీ ప్రపంచంలో చెరగని ముద్ర వేశారని గుర్తుచేశారు. అనంతరం తెలంగాణ రచయితల వేదిక (తెరవే) జిల్లా అధ్యక్షుడు గఫూర్ శిక్షక్ మాట్లాడుతూ చాట్ల నర్సయ్య తన పరిశోధనలతో కామారెడ్డి జిల్లా కీర్తి ప్రతిష్టలను నలుదిశలా వ్యాపింపజేశారని గుర్తుచేశారు. ఉత్తమ అధ్యాపకుడిగా ఎంతోమంది శిష్యులను సమాజానికి ఉపయోగపడే మేటి పౌరులుగా తీర్చిదిద్దారని తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ గజల్ కవి సూరారం శంకర్, డాక్టర్ జి.లచ్చయ్య, గంగాప్రసాద్, పీతాంబర్, నాగభూషణం, సుప్పని సత్యనారాయణ, సీహెచ్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.


