గిరిజన సంస్కృతికి ప్రతీక తీజ్‌ | - | Sakshi
Sakshi News home page

గిరిజన సంస్కృతికి ప్రతీక తీజ్‌

Aug 10 2026 1:34 AM | Updated on Aug 10 2026 1:34 AM

తొమ్మిది రోజుల పాటు నియమ

నిష్ఠలతో పూజలు

పోచారం– రాంపూర్‌ తండాలో ముగిసిన ఉత్సవాలు

బాన్సువాడ రూరల్‌: గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు తీజ్‌ పండుగ ప్రతీకగా నిలుస్తోంది. పెళ్లి కాని యువతులు తమకు మంచి భర్త లభించాలని, వర్షాలు కురిసి పాడిపంట బాగుండాలని ఏటా గిరిజన తండాల్లో తొమ్మిదిరోజుల పాటు తీజ్‌ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. తీజ్‌ను బంజారాల బతుకమ్మగా పిలుస్తారు.

శీత్లా భవాని పండుగతో ప్రారంభం..

ఆషాఢమాసంలో తొలకరి విత్తనాలు విత్తిన తర్వాత శీత్లాభవాని పండుగ జరుపుకుంటారు. గిరిజన మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి ఆటపాటలతో తండా పొలిమేరల్లో ఏర్పాటు చేసిన శీత్లాభవాని అమ్మవార్లకు నైవేద్యం తీసుకెళ్లి భక్తిశ్రద్ధలతో సమర్పిస్తారు. శీత్లా పండుగ అనంతరం తండానాయక్‌ కారోబార్‌ ఆశీర్వాదం, అనుమతి తీసుకుని తీజ్‌ పండుగను ప్రారంభిస్తారు. అందంగా అల్లిన బుట్టల్లో మట్టిని నింపి వాటిలో గోధుమ విత్తనాలు నాటుతారు. బుట్టలన్నీ నాయక్‌ ఇంటిముందు మంచె ఏర్పాటు చేసి దానిపై ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. తొమ్మిది రోజులకు బుట్టల్లో ఆకుపచ్చని మొలకలు దట్టంగా పెరుగుతాయి. ఇలా పెరగడం గిరిజనులకు శుభంగా భావిస్తారు.

తండా పెద్దల ఆశీర్వాదంతో..

తొమ్మిదోరోజు గిరిజనుల ఆరాధ్యదైవం శ్రీసంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌కు, మేరమ్మ యాడీ (పార్వతీదేవి), భవాని మాతలకు ప్రత్యేక పూజలు చేస్తారు. బెల్లం, బియ్యంతో వండిన పరమాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం తండా పెద్దల ఆశీర్వాదం తీసుకుని మొలకలు వచ్చిన బుట్టలను తలపై పెట్టుకుని నృత్యాలు చేస్తూ స్థానిక చెరువులో నిమజ్జనం చేస్తారు. యువతులకు వారి సోదరులు, బంధువులు కానుకలు ఇస్తారు.

ప్రముఖుల రాక..

పోచారం–రాంపూర్‌ తండాల్లో ఆదివారం జరిగిన తీజ్‌ ముగింపు ఉత్సవాలకు వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు సురేందర్‌రెడ్డి, మోహన్‌నాయక్‌ హాజరై గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, మోరిల్‌ శ్రీనివాస్‌రావు, అంజిరెడ్డి, జుబేర్‌లు శుభాకాంక్షలు తెలిపారు. తండావాసులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement