క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Aug 7 2026 1:32 AM | Updated on Aug 7 2026 1:32 AM

కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్‌

తాడ్వాయి(ఎల్లారెడ్డి): కల్తీ కల్లు అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సదాశివనగర్‌ సీఐ సంతోష్‌కుమార్‌ తెలిపారు. తాడ్వాయి పోలీసు స్టేషన్‌లో గురువారం ఆయన వివరాలు వెల్లడించారు. ఈనెల 5న పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కరడ్‌పల్లిలో ఓ కల్లు దుకాణంపై ఎస్సై నరేష్‌ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కల్లు విక్రేత సీతూరి గౌండ్ల పోచగౌడ్‌ (50)ను అదుపులోకి తీసుకుని దుకాణాన్ని పరిశీలించగా, వినియోగదారులకు విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన 60 కల్లు సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో కల్లులో

అల్ప్రాజోలామ్‌ అనే నిషేదిత పదార్థాన్ని కలిపి విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. అదే సమయంలో దుకాణంలో కల్లు సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులకు నిర్వహించిన ప్రాథమిక డ్రగ్‌ టెస్టులో బెంజోడయాజైపెన్‌ పాజిటివ్‌గా తేలింది. అనంతరం వారికి ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో కూడా పాజిటివ్‌ వచ్చిందన్నారు. దీంతో కల్లు దుకాణ నిర్వాహకుడు కొండాపురం స్వామిగౌడ్‌ (36)ను గురువారం అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ కేసులో 60 కల్లు సీసాలు, రెండు మొబైల్‌ ఫోన్లతో పాటు ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకొని నిందితులను కోర్టులో హాజరుపరుస్తామన్నారు.

కల్లు దుకాణం నిర్వాహకుడిపై కేసు

ఎల్లారెడ్డిరూరల్‌: మండలంలోని వెల్లుట్ల గ్రామంలోగల కల్లు దుకాణం నిర్వాహకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై–2 సుబ్రహ్మణ్యచారి గురువారం తెలిపారు. వెల్లుట్ల గ్రామానికి చెందిన సాతెల్లి నాగేశ్వర్‌గౌడ్‌ కల్లు దుకాణంలో నిషేధిత మత్తు పదార్థాలు కల్లులో కలిపి విక్రయిస్తున్నాడన్న సమాచారం రావడంతో ఈగల్‌ టీంతో కలిసి పోలీసులు దాడులు నిర్వహించారు. కల్లులో నిషేధిత మత్తు పదార్థాలు కలపడంతో నాగేశ్వర్‌గౌడ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ఒకరిపై పీడీ యాక్టు..

కామారెడ్డి క్రైం: బెదిరింపులు, బలవంతపు వసూళ్లు, దోపిడీలకు పాల్పడుతున్న ఓ రౌడీషీటర్‌పై పీడీ యాక్టు నమోదు చేస్తూ కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు ఇలా.. సదాశివనగర్‌ మండలం వజ్జేపల్లి గ్రామానికి చెందిన కాట్యాడ బాపూరావు అనే వ్యక్తి గతంలో పలు క్రిమినల్‌ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల దేవునిపల్లి పీఎస్‌లో మరో దోపిడీ కేసు, గాంధారి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన దోపిడీ, క్రిమినల్‌ బెదిరింపులకు సంబంధించిన రెండు కేసుల్లోనూ అతడు కీలక నిందితుడు. ప్రజలను బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేయడం, జర్నలిస్టు పేరుతో భయాందోళనలు సృష్టించడం, దోపిడీలకు పాల్పడటం లాంటి చర్యలతో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగించినందుకు గాను అతడిపై పీడీ యాక్ట్‌ అమలు చేసినట్లు ఎస్పీ రాజేశ్‌చంద్ర ఒక ప్రకటనలో తె లిపారు. ప్రస్తుతం నిందితుడు నిజామాబాద్‌ సెంట్రల్‌ జై లులో రిమాండ్‌లో ఉన్నాడు. అక్కడకు వెళ్లి రూరల్‌ సీఐ శ్రీధర్‌ గౌడ్‌ నిందితుడికి ఉత్తర్వులను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement