కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన వంగ మహిపాల్ అనే వ్యక్తి రెండు రోజులుగా కనిపించకుండా పోయినట్లు పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి బుధవారం తెలిపారు. ఓ స్టీల్ దుకాణంలో పనిచేసే అతడు మంగళవారం ఇంటి నుంచి దుకాణానికి వెళ్లాడు. రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు చాలా చోట్ల గాలింపు చేపట్టినా, అతడి ఆచూకి లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.
తాడ్వాయి మండలంలో..
తాడ్వాయి(ఎల్లారెడ్డి): తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టగా తాడ్వాయికి చెందిన ఇద్దరు వ్యక్తులు అతిగా మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. వారిని పోలీసులు బుధవారం కామారెడ్డి కోర్టులో హాజరుపర్చగా జడ్జి ఒక రోజు జైలుశిక్ష, రూ.1000 చొప్పున జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
నవీపేట: మండల కేంద్రంలోని ధర్యాపూర్ కాలనీలో తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు దొంగతనానికి పాల్పడినట్లు ఎస్సై శ్రీకాంత్ బుధవారం తెలిపారు. కాలనీకి చెందిన అంకం ఆనంద ఈనెల 8న తన ఇంటికి తాళం వేసి, కుటుంబ సభ్యులతో కలిసి వేరే ఊర్లో బంధువుల ఇంటికి వెళ్లింది. వారు ఈ నెల 10న ఇంటికి తిరిగి రాగా తలుపులు తీసి ఉన్నట్లు గుర్తించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తాళాలు పగుల గొట్టి 16 గ్రాముల బంగారు ఆభరణాలు, కొంత నగదును ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


