అభ్యర్థులకు ప్రచార కష్టాలు
బాన్సువాడ : మున్సికల ప్రచారం అభ్యర్థులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. తాడ్కోల్ శివారులో ఉన్న డబుల్ బెడ్ కాలనీ ఓటర్ల వద్దకు వెళ్లి ప్రచారం చేయాలంటే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. బాన్సువాడ పట్టణానికి మూడు కిలో మీటర్ల దూరంలో తాడ్కోల్ శివారులో గత ప్రభుత్వ హయాంలో 1,000 డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి అర్హులైన పేదలకు అందజేసింది. ఆ ఇళ్లలో 2 వేలపైనే ఓట్లర్లు నివసిస్తున్నారు. అక్కడ నివనించే ఓటర్లు గతంలో పట్టణంలోని పలు వార్డుల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఈ ఇళ్లలో నివాసముండి దాదాపు నాలుగేళ్లు అవుతుంది. ఈ కాలనీని ప్రత్యేక వార్డుగా గుర్తించి ఇక్కడే ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీంగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రజలు మున్సిపల్ అధికారులకు దరఖాస్తు సైతం చేసుకున్నారు. ప్రస్తుతం పట్టణంలో 19 వార్డులు ఉన్నాయి. కొత్తగా వార్డులు ఏర్పాటు చేయలేదు. ఇక్కడ నివసిస్తున్న ఓటర్లు తమ పాత వార్డుల్లోనే ఓటు వేయాల్సి వస్తోంది. డబుల్ బెడ్ రూం ఇళ్లలో పలు వార్డులకు సంబంధించిన ఓటర్లు ఉన్నారు. ఆయా వార్డుల్ల పోటీ చేసే అభ్యర్థులు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల కాలనీకి వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక్కడి ఓటర్లు గెలుపు, ఓటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది.
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయాలంటే మూడు కిలోమీటర్లు వెళ్లాల్సిందే. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో 8వ వార్డులో ఓటు వచ్చింది. ఇప్పుడేమో 15వ వార్డులో ఓటు ఉంది. ఎప్పుడు ఎక్కడ ఓటు వస్తుందో నాకే తెలియడం లేదు. నేను ఎలాగోలా వెళ్తా. కానీ మా అమ్మ నడవలేని స్థితిలో ఉంది. అంత దూరం ఎలా వెళ్లాలి.
–విష్ణు, డబుల్ బెడ్ రూం కాలనీవాసి
దూరంతో ఇబ్బందులు..
తాడ్కోల్ డబుల్ బెడ్‌రూం కాలనీవాసులు పట్టణానికి రావాలంటే ఆటోలే దిక్కు. రవాణా సౌకర్యం లేదు. చాలా మంది కాలినడకనే వస్తుంటారు. ద్విచక్ర వాహనాలు ఉన్న వారికి ఇబ్బందులు ఉండవు. మున్సిపల్‌లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు సిద్ధమవుతున్నారు. పట్టణంలో ప్రతి వార్డుకో రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మామూలు రోజుల్లో ఆటోలో రావాలంటే పట్టణానికి రూ.100 వసూలు చేసేవారు. మున్సిపల్ ఎన్నికల వేళ ఓటు హక్కు వినియోగించుకోవాలంటే రవాణా భారం పిరం కానుంది. ఇక్కడి ఓటర్ల ఓటు కావాలనుకునే అభ్యర్థులు ప్రతీ రోజూ రెండు, మూడు సార్లు వచ్చి ప్రసన్నం చేసుకుంటే గానీ ఓట్లు పడే అవకాశం లేదు.
గల్లీలో ఓట్లు.. డబుల్ బెడ్ రూం కాలనీలో ఇళ్లు
తాడ్కోల్ డబుల్ బెడ్ రూం కాలనీలో
2 వేలకు పైగా ఓటర్లు
అభ్యర్థులకు ప్రచార కష్టాలు


