అందరి దృష్టి దేవునిపల్లి పైనే..
కామారెడ్డి బల్దియాలో విలీనమైన దేవునిపల్లి గ్రామంపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఇక్కడ నాలుగు వార్డులుండగా.. అన్నీ మహిళలకే రిజర్వ్ అయ్యాయి. మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానం మహిళకు కేటాయించడంతో కాలం కలిసి వస్తే ఇక్కడినుంచి గెలిచినవారికే బల్దియా పాలన పగ్గాలు అందే అవకాశాలున్నాయి. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
● విలీన గ్రామంలో నాలుగు వార్డులు
● అన్ని స్థానాలు మహిళలకే రిజర్వ్
● కాలం కలిసొస్తే చైర్‌పర్సన్
అయ్యే అవకాశం
కామారెడ్డి పట్టణానికి ఆనుకుని ఉన్న దేవునిపల్లి గ్రామం కొన్ని దశాబ్దాలపాటు ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉంది. నియోజకవర్గాల సర్దుబాటు జరిగినపుడు కామారెడ్డి నియోజక వర్గంలోకి మారింది. కామారెడ్డి పట్టణం విస్తరించే క్రమంలో మున్సిపాలిటీలో విలీనమైంది. దేవి విహార్, కాకతీయనగర్, మధురానగర్, పదహారిళ్ల పోర్షన్, బ్రహ్మంగారి గుడి ఏరియా, జీవదాన్ కాలనీ, విద్యుత్ కాలనీ, బీడీ కాలనీ, సాయి సద్గురు కాలనీ... ఇలా దేవునిపల్లి శివారు అంతా పట్టణంలో కీలకమైన ప్రాంతంగా ఎదిగింది. దీనికి తోడు మెడికల్ కాలేజీ కూడా అక్కడే ఏర్పాటు కావడం, భారీ వెంచర్లు రావడం, విల్లాలు, అపార్టుమెంట్ల నిర్మాణాలు సాగుతుండడంతో దేవునిపల్లి శివారు అంతా కాస్ట్‌లీగా మారింది. గత మున్సిపల్ పాలక వర్గం పదవీ కాలం ముగియకముందు నుంచే ఆయా వార్డుల్లో పోటీ చేయాలనుకున్న వారు సేవా కార్యక్రమాలతో జనంలో ఉన్నారు. కొన్ని వార్డుల్లో ఇప్పటికే రూ. లక్షలు ఖర్చు చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి మరింత ఖర్చు పెడుతున్నారు. సంఘాలు, సిండికేట్లు, కులాల పేరుతో ఓట్ల కొనుగోలు దందా నడుస్తోంది.
దేవునిపల్లి గ్రామం
దేవునిపల్లి పరిధిలోని నాలుగు వార్డుల నుంచి పోటీ చేస్తున్న ఆయా పార్టీల అభ్యర్థులు కాలం కలిసొస్తే మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠం మీద కూర్చునే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇంట గెలవాలన్న పట్టుదలతో అభ్యర్థుల తరపున వారి భర్తలు చెమటోడుస్తున్నారు. ఏ అవకాశాన్ని వదలకుండా గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎంత ఖర్చు చేయడానికయినా వెనకాడడం లేదని తెలుస్తోంది.
అందరి దృష్టి దేవునిపల్లి పైనే..


