‘సామాజిక అంశాలపై పట్టు సాధించాలి’
కామారెడ్డి టౌన్: పాఠశాల దశ నుంచే సామాజిక అంశాలపై పట్టు సాధించాలని, అప్పుడే దేశానికి ఉపయోగపడే వ్యక్తులుగా మారగలుగుతారని డీఈవో రాజు పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సాందీపని డిగ్రీ కళాశాలలో సోషల్ స్టడీస్ టీచర్స్ ఫోరం(ఎస్‌టీఎఫ్) ఆధ్వర్యంలో జిల్లాస్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సాంఘికశాస్త్రంలో సరైన అవగాహన కలిగి ఉంటే సమాజంలో బాధ్యత కలిగిన ఉత్తమ పౌరులుగా ఎదుగుతారన్నారు. టాలెంట్ టెస్ట్‌లో జిల్లావ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి సుమారు 170 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన వారిలో వివిధ విభాగాల నుంచి కర్ల సుప్రియ, జి.శైలజ, బి.అరుణ్, జె.శ్రీకాంత్, కె.సంజన, శివశక్తి, బి.నందిని, సంజన, ఆర్.శ్రీదీప్, రఫత్, మహిన్ ఖానమ్‌లను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశామని టీఎస్‌ఎస్‌టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రసన్ కుమార్ తెలిపారు. వీరు ఈనెల 7న హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి సోషల్ స్టడీస్ టాలెంట్ టెస్టులో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి నూతిపల్లి బాలరాజ్, కోశాధికారి రాజశేఖర్, ఉపాధ్యక్షురాలు విజయ కుమారి, టెక్నికల్ విభాగం ప్రతినిధి రామచందర్ తదితరులు పాల్గొన్నారు.


