అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుల అరెస్ట్‌

Feb 3 2026 7:20 AM | Updated on Feb 3 2026 7:20 AM

అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుల అరెస్ట్‌

అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుల అరెస్ట్‌

కామారెడ్డి క్రైం: తప్పించుకొని తిరుగుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులిద్దరిని కామారెడ్డి పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేశ్‌చంద్ర వివరాలు వెల్లడించారు. గత నెల 2 న మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని అశోక్‌ నగర్‌ కాలనీలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో దొంగలు పడి నగదు, బంగారం అపహరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మెదక్‌ జిల్లా నర్సాపూర్‌కు చెందిన చిల్లకూరి క్రిష్ణారెడ్డి అలియాస్‌ చండీక్రిష్ణను పోలీసులు 20 రోజుల క్రితమే అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు. అదే ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు నిందితులు మూడవత్‌ అంజియా, సత్యనారాయణ (దొంగ సొత్తును కొనుగోలు చేసిన వ్యక్తి)లను కామారెడ్డిలోని సిరిసిల్ల బైపాస్‌ వద్ద అనుమాన్పాదంగా తిరుగుతుండగా పట్టుకున్నారు. వారి నుంచి రెండు సెల్‌ఫోన్‌లు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. పట్టుబడిన నిందితులు క్రిష్ణారెడ్డి, మరోవ్యక్తి అయిన ప్రభులతో కలిసి తాళం వేసిన షట్టర్లు, ఇళ్లను టార్గెట్‌ చేసి చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. దొంగిలించిన బంగారు ఆభరణాలను ముత్తూట్‌, ఇతర ఫైనాన్స్‌లలో తాకట్టు పెట్టడం, గుర్తు తెలియని వ్యాపారులకు అమ్మడం చేస్తారని, వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తుంటారని విచారణలో వెల్లడైనట్లు ఎస్పీ తెలిపారు. అంజియాపై ఏపీ, తెలంగాణల్లోని పలు పీఎస్‌లలో 5, క్రిష్ణారెడ్డిపై 8 కేసులు ఉన్నట్లు వివరించారు. కేసు ఛేదనలో కృషి చేసిన సీఐ నరహరి, సీసీఎస్‌ సీఐ శ్రీనివాస్‌, సిబ్బందిని అభినందించారు.

బంగారం గొలుసు చోరీ కేసులో..

వృద్ధురాలిని నమ్మించి బంగారం గొలుసు అపహరించిన కేసులో నిందితుడిని పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. డీపీవోలో సోమవారం ఎస్పీ రాజేశ్‌ చంద్ర వివరాలు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని భరత్‌ రోడ్‌కు చెందిన బట్టు నర్సవ్వ కూరగాయలు అమ్ముకుంటూ జీవిస్తోంది. రెండు రోజుల క్రితం భూపుత్రమ్మ కల్యాణ మండపం సమీపంలోని కల్లు దుకాణంలో కల్లు సేవించి ఇంటికి వెళ్తుండగా గాంధారి మండలం జెమిని తండాకు చెందిన రత్లా రవి మాటలు కలిపాడు. ఆమె సరిగ్గా నడవలేని స్ధితిలో ఉండటాన్ని గమనించి బైక్‌పై ఇంటివద్ద దింపుతానని నమ్మించాడు. ఇంటికి తీసుకువెళ్లిన అనంతరం వృద్ధురాలికి మళ్లీ కల్లు తాగించి, మత్తులో ఉన్న ఆమె మెడలో నుంచి తులం బంగారు గుండ్లను లాక్కొని పరారయ్యాడు. మరుసటి రోజు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా రవిని గుర్తించి సోమవారం పట్టుకున్నారు. పట్టణ పోలీసులను ఎస్పీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement