‘సాగర్’కు సింగూరు జలాలు
నిజాంసాగర్‌లో 14 టీఎంసీల నిల్వ
నిజాంసాగర్: సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ ప్రాజెక్టునుంచి నిజాంసాగర్‌కు శనివారం నీటి విడుదలను ప్రారంభించనున్నారు. రోజుకు 3 వేల క్యూసెక్కుల చొప్పున మొత్తం 8 టీఎంసీల నీటిని వరద గేట్ల ద్వారా వదలనున్నారు.
సింగూరు ప్రాజెక్టు కరకట్టతో పాటు రివిట్‌మెంట్ బలోపేతం పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 13 కోట్లు మంజూరు చేసింది. దీంతో మరమ్మతు పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులో ఉన్న నీటిని ఖాళీ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు నీటి విడుదలకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో 16 టీఎంసీల మేర నీటి నిల్వలు ఉన్నాయి. ప్రాజెక్టు మరమ్మతుల నేపథ్యంలో 8 టీఎంసీలను ఖాళీ చేయాలని అధికారులు నిర్ణయించారు. వరద గేట్ల ద్వారా రోజుకు మూడు వేల క్యూసెక్కుల చొప్పున దిగువనకు విడుదల చేయనున్నారు. మంజీర డ్యాంతో పాటు మంజీర నది ద్వారా సింగూరు జలాలు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి చేరతాయి.
పరవళ్లు తొక్కనున్న మంజీర
వర్షాకాలంలో భారీ వర్షాలు కురియడంతో దాదాపు సీజన్ మొత్తం మంజీర నది పరవళ్లు తొక్కింది. నెల రోజులుగా వర్షాలు లేకపోవడంతో నది శాంతించింది. అయితే సింగూర్‌నుంచి నీటిని విడుదల చేయనుండడంతో మరోసారి నదికి జలకళ రానుంది.
సింగూరు ప్రాజెక్టు మరమ్మతులు ప్రారంభిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదేశాలతో ప్రాజెక్టు నీటిని ఖాళీ చేయిస్తున్నారు. రోజుకు మూడు వేల క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తారు.
– శ్రీనివాస్, జిల్లా నీటిపారుదలశాఖ, సీఈ
నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,045 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. శుక్రవారం సాయంత్రానికి 1,402.44 అడుగుల(14.253 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. ఆయకట్టు అవసరాలకోసం నీటిని విడుదల చేయడంతో సుమారు మూడున్నర టీఎంసీలు ఖాళీ అయ్యింది. సింగూరునుంచి నీరు రానుండడంతో నిజాంసాగర్ మరోసారి పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరనుంది.
నేటి నుంచి నీటి విడుదల
రోజుకు మూడు వేల
క్యూసెక్కుల చొప్పున..
8 టీఎంసీలు విడుదల చేయనున్న
అధికారులు
‘సాగర్’కు సింగూరు జలాలు


