భావి శాస్త్రవేత్తలను తయారుచేసేది టీచర్లే
● కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
● ముగిసిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన
కామారెడ్డి టౌన్: భావి శాస్త్రవేత్తలను తయారు చేసేది ఉపాధ్యాయులేనని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. గురువులు ఎప్పుడూ పూజనీయులేనన్నారు. జిల్లా కేంద్రంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్ శుక్రవారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయులు బడిలోనే ఉండాలని, కానీ కొందరు బయట తిరుగుతున్నారని, దానిని తగ్గించుకోవాలని సూచించారు. రాబోయే బడ్జెట్ సమావేశాలలో విద్యావ్యవస్థపై చర్చిస్తానన్నారు. కాగా ఉదయం ప్రదర్శనను సందర్శించిన ఆయన.. విద్యార్థులు తయారు చేసిన ఒక్కో ప్రాజెక్టును పరిశీలిస్తూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. సామాజిక సమస్యలకు పరిష్కారం చూపేలా నూతన ఆవిష్కరణలు ఉండాలన్నారు. విద్యార్థులు దేశభక్తి పెంపొందించుకోవడంతోపాటు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి సూచించారు.
వివిధ స్థాయిలకు ఎంపిక
రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిపి 1,700 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని జిల్లా సైన్స్ అధికారి సిద్ధరాంరెడ్డి తెలిపారు. మొత్తం 7 విభాగాలలో 870 ప్రదర్శనలు ఇచ్చారన్నారు. జూనియర్, సీనియర్ విభాగాల నుంచి ఉత్తమ ప్రతిభ కనబరిచినవారిని దక్షిణ భారత, జాతీయ స్థాయి సైన్స్‌ఫెయిర్‌లకు ఎంపిక చేశామన్నారు. వారికి బహుమతులు అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నికోలస్, డీఈవో రాజు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


