గ్రామాల అభివృద్ధి కోసమే చట్టంలో మార్పులు
నాగిరెడ్డిపేట: గ్రామాల అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ చట్టంలో మార్పులు తెచ్చిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిన్నరాజులు పేర్కొన్నారు. నాగిరెడ్డిపేటలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, ఆజీవిక మిషన్–గ్రామీణ్(జీ రామ్ జీ) చట్టం గ్రామాల అభివృద్ధిలో విప్లవాత్మక చట్టంగా రూపుదిద్దుకుంటుందన్నారు. ఈ చట్టంపై గ్రామీణ ప్రాంతాల్లో గందరగోళం సృష్టించడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఉపాధిహామీ పథకంలో ఇప్పటివరకు 100 రోజులుగా ఉన్న పనిదినాలను 120 రోజులకు పెంచారని గుర్తుచేశారు. నూతన చట్టం ద్వారా గ్రామాల్లో గ్రామసభ నిర్వహించి గ్రామాభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనులను గుర్తిస్తారన్నారు. ఈ పథకం ద్వారా ముఖ్యంగా నీటిసంరక్షణ, మౌలిక సదుపాయాల కల్పన, జీవనోపాధితోపాటు విపత్తు నిర్వహణకు సంబంధించిన పనులను చేపడతారని పేర్కొన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు హన్మండ్లు, బాలయ్య, నరేందర్‌రెడ్డి, కృష్ణ, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి క్రైం: నిషేధిత చైనా మాంజా విక్రయాలపై పోలీసులు దృష్టి సారించారు. అందులో భాగంగా శుక్రవారం జిల్లావ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. జిల్లా కేంద్రంలోని దుకాణాలలో సీఐ నరహరి ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. శుక్రవారం జిల్లాలో మొత్తం 157 చోట్ల తనిఖీలు చేశామని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. ప్రమాదకరమైన చైనా మాంజాను ప్రభుత్వం నిషేధించిందన్నారు. ఎవరైనా విక్రయిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. సంక్రాంతి వేళ అందరూ సాధారణ దారంతోనే పతంగులు ఎగురవేయాలని సూచించారు.
ఖలీల్‌వాడి: బ్యాంకింగ్, ఆర్‌ఆర్‌బీ, స్టాఫ్ సెలెక్షన్ పరీక్షలకు సిద్ధమయ్య ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభ్యర్థులు ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజ గంగారాం, ఇంచార్జి డైరెక్టర్ సోమశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ నగరంలోని నాందేవ్‌వాడ ఎస్సీ స్టడీ సర్కిల్ లో ఐదు నెలలపాటు శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 30 వరకు http.//tsstudycircle.co.in/ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. అభ్యర్థులు డిగ్రీ అర్హత ఉండి, కుటుంట వార్షిక ఆదాయం రూ. 3 లక్షలకు తక్కువ ఉన్నావారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఫిబ్రవరి 8 న నిజామాబాద్‌లో ప్రవేశ పరీక్ష ఉంటుందని, మార్కుల ఆధారంగా 100 మంది అభ్యర్థులు ఎంపిక చేస్తామన్నారు. పూర్తి వివరాలకు 9440196945, 9951199460, 9490511953 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
గ్రామాల అభివృద్ధి కోసమే చట్టంలో మార్పులు


