పోచారం నీటి విడుదల
నాగిరెడ్డిపేట: పోచారం ప్రాజెక్టు నుంచి శుక్రవారం నీటి విడుదలను నీటిపారుదల శాఖ ఎస్‌ఈ యశస్వి, ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిబంధనల ప్రకారం ప్రాజెక్టు నీటిని ఈ ఏడాది యాసంగి సీజన్‌లో ‘బీ’ జోన్ పరిధిలోని 3,806 ఎకరాలకు అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం 150 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువలోకి విడుదల చేశామని పేర్కొన్నారు. ఐదు విడతలపాటు నీటిని అందిస్తామన్నారు. ప్రతి విడతలో 15 రోజులపాటు నీటిని విడుదలచేస్తూ 10 రోజులపాటు విరామం ఇస్తామని తెలిపారు.
మంజీరలో పూడికతీతకు నిధులు..
నాగిరెడ్డిపేట మండలంలోని మంజీర నదిలో పూడికతీత, పొదల తొలగింపు కోసం రూ. 2.08 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఇరిగేషన్ ఎస్‌ఈ యశస్వి తెలిపారు. నదిలో దట్టంగా పెరిగిన పొదలతోపాటు పూడిక కారణంగా నిజాంసాగర్ ప్రాజెక్టు నీరు వెనక్కి వస్తూ పంటలు ముంపునకు గురవుతున్నాయని పేర్కొన్నారు. మంజీర పరీవాహక ప్రాంత రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పూడిక తొలగించడం కోసం నిధులు విడుదల చేసిందన్నారు. సాంకేతిక అనుమతులు వచ్చిన వెంటనే టెండర్ ప్రక్రియ చేపడతామన్నారు. గతేడాది ఆగస్టు చివరలో వచ్చిన వరదల కారణంగా దెబ్బతిన్న పోచారం ప్రాజెక్టు కుడి అలుగు మరమ్మతుల కోసం రూ.3.60 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈఈ వెంకటేశ్వర్లు, ఏఈ అక్షయ్‌కుమార్, డిప్యూటీ తహసీల్దార్ రాజేశ్వర్, పోచారం సర్పంచ్ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.


