తొలగించేదెప్పుడో?
ఇసుక మేటలు..
జిల్లాలో ఆగస్టు చివరి వారంలో కురిసిన భారీ వర్షాల కారణంగా వాగులు ఉప్పొంగి, పొలాలను ఇసుక మేటలతో ముంచేశాయి. వాటిని ఉపాధి హామీ పథకంలో తొలగిస్తామని పాలకులు ఇచ్చిన హామీ అలాగే ఉండిపోయింది. ఇప్పటికీ మేటలు అలాగే ఉండడంతో పంటలు ఎలా సాగు చేయాలని రైతులు ఆందోళన చెందుతున్నారు. – లింగంపేట
లింగంపేట శివారులోని పొలంలో చేరిన రాళ్లు
వర్షాకాలంలో జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. వాగులు ఉప్పొంగడంతోపాటు చెరువులు, కుంటల కట్టలు తెగిపోవడంతో పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. లింగంపేట మండలంలోని పెద్దవాగు, పాముల వాగుకు భారీగా వరద నీరు పోటెత్తడంతో పరీవాహక ప్రాంతాల్లోని భూముల్లో ఇసుకతోపాటు రాళ్లు పేరుకుపోయాయి. అప్పట్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లింగంపేట మండలానికి వచ్చి పాముల వాగు వంతెన, రోడ్డు, బూరుగిద్ద వద్ద ఏర్పడిన ఇసుక మేటలను పరిశీలించారు. ఆయన లింగంపల్లి పాముల వాగు వంతెనతో పాటు రోడ్లు నూతనంగా నిర్మించడానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే పొలాల్లో ఏర్పడిన ఇసుక మేటలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు ఉపాధి హామీ పథకంలో ఇసుక మేటలు తొలగించడానికి కొలతలు తీశారు. బూరుగిద్దలో పనులు సైతం ప్రారంభించారు. అక్కడక్కడ ఇసుక తొలగించి వదిలేశారు. యాసంగి పంటల సాగు సీజన్ మొదలై నెల గడిచినా ఇసుక మేటల తొలగింపు పూర్తి కాకపోవడంతో పలువురు రైతులు వేలాది రూపాయలు ఖర్చు చేస్తూ భూములను సాగుకు యోగ్యంగా మార్చుకుంటున్నారు. ఇప్పటికే ఇసుక మేటలతో పంటలను కోల్పోయామని, ఇప్పుడు ఇసుక తొలగించడానికి అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లింగంపేట మండలంలో 288 ఎకరాల్లో ఇసుక మేటలు ఏర్పడినట్లు అధికారుల సర్వేలో తేలింది. లింగంపేటలో 125 మంది రైతులు, కన్నాపూర్ 111, లింగంపల్లి(ఖుర్దు) 117, కొర్పోల్ 58, పొల్కంపేట 33, శెట్పల్లి 36, పోతాయిపల్లి 33, మోతె 15, మెంగారం 15, బాయంపల్లి 11, నల్లమడుగు 10, పర్మళ్ల 7 ఎకరాలతో పాటు బూరుగిద్ద, ముంబోజీపేట్ తండా, కొండాపూర్ తదితర గ్రామాల్లోని 602 మంది రైతులకు సంబంధించిన భూముల్లో ఇసుక మేటలున్నాయి. ఉపాధి హామీలో 15 ఎకరాల్లో మాత్రమే ఇసుక మేటలు తొలగించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అధికారులు స్పందించి ఇసుకను తొలగించాని కోరుతున్నారు.
నెలలు గడుస్తున్నా
ముందుకు సాగని పనులు
సాగుకు అనుకూలంగా
మారని భూములు
పట్టించుకోని అధికారులు
ఆందోళన చెందుతున్న రైతులు
తొలగించేదెప్పుడో?


