ఆర్టీసీలో రోడ్డు భద్రత మాసోత్సవాలు ప్రారంభం
కామారెడ్డి టౌన్: జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను గురువారం ఆర్టీసీ కామారెడ్డి డిపోలో ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా ఏఎస్పీ చైతన్యరెడ్డి, ఎంవీఐ శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాసోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ దినేష్‌కుమార్, ఆర్టీసీ సీఐ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్: అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలల ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల కోసం (ఫ్రెష్, రెన్యూవల్) దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆధార్ కార్డు ద్వారా ఈ–కేవైసీ పూర్తి చేయాల్సి ఉన్నందున ఏవైనా ఆధార్ సవరణలుంటే ముందుగానే చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కొత్త దరఖాస్తులు మీ సేవా కేంద్రాల్లో, రెన్యువల్స్ ఆయా కళాశాలల్లో చేయాల్సి ఉంటుందని తెలిపారు. మార్చి 31 వరకు దరఖాస్తుకు గడువుందని పేర్కొన్నారు.
సుభాష్‌నగర్: నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ఎస్‌జీఎఫ్‌ఐ అండర్–19 బాలుర హాకీ పోటీలకు ఎంపికలను శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆర్మూర్ మినీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు హాకీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సదమస్తుల రమణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సెలక్షన్స్‌లో పాల్గొనే క్రీడాకారులు సరైన ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు. ఏవైనా సందేహాలుంటే 99630 41304 (కే అంజు)ను సంప్రదించాలని తెలిపారు. ఎంపికై న తుది జట్టు ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ వీఎం హోమ్ రెసిడెన్షియల్ స్కూల్ మైదానంలో నిర్వహించే రాష్ట్రస్థాయి అంతర్ కళాశాలల క్రీడా పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
కామారెడ్డి టౌన్: ఇంటర్మీడియట్ పూర్తి చేసినవారికి సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు శనివారం జిల్లా కేంద్రంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, హెచ్‌సీఎల్ కంపెనీ ప్రతినిధి రాజుల రాజేష్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హెచ్‌సీఎల్ టెక్ బీ ఆధ్వర్యంలో ఐటీ, డీపీవో పోస్టుల భర్తీ కోసం ఈ మేళా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 2024, 2025లలో ఇంటర్ పూర్తి చేసిన వారితో పాటు 2026లో పరీక్షలకు హాజరవుతున్న ఎంపీసీ, సీఈసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, ఒకేషనల్ గ్రూపుల విద్యార్థులు హాజరుకావచ్చని తెలిపారు. ఆసక్తిగలవారు పదో తరగతి, ఇంటర్ మార్కుల జాబితా, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులతో శనివారం ఉదయం 10 గంటలకు కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కామర్స్ ల్యాబ్ వద్దకు రావాలని, పూర్తి వివరాలకు 80740 65803, 97016 65424 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
కామారెడ్డి టౌన్: తెలంగాణ వైద్య విధాన పరిషత్ జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త (డీసీహెచ్‌ఎస్) ఇన్‌చార్జి బాధ్యతలను బాన్సువాడ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయ్ భాస్కర్‌కు అప్పగించారు. డీసీహెచ్‌ఎస్ విజయలక్ష్మి బుధవారం పదవీ విరమణ పొందడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కామారెడ్డి క్రైం: డిసెంబర్ 31 రాత్రి నిర్వహించిన వాహనాల తనిఖీల్లో జిల్లావ్యాప్తంగా 242 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి సబ్ డివిజన్ పరిధిలో 117, ఎల్లారెడ్డి సబ్ డివిజన్ పరిధిలో 55, బాన్సువాడ సబ్ డివిజన్ పరిధిలో 70 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.


