
మాడిపోయిన సోయా పంట
పరిహారం ఇప్పించండి
● నాసిరకం మందుల పిచికారీతో మూడున్నర ఎకరాల్లో పంట నష్టం
● రైతు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికార యంత్రాంగం
బిచ్కుంద(జుక్కల్): పంటలపై పురుగు ఆశించకుండా మందు మంచిగా పనిచేస్తుందని వ్యాపారులు రైతులను నమ్మించి నట్టేట ముంచుతున్నారు. మండలంలోని చిన్నదడ్గి గ్రామానికి చెందిన గంగారాం మూడున్న ఎకరాలలో సోయా, అంతర పంటగా కంది సాగుచేస్తున్నాడు. సోయా పంటపై కొద్దిగా పచ్చ పురుగులు ఆశిస్తున్నాయని గుర్తించి 15 రోజుల క్రితం పురుగు మందు పిచికారీ చేశాడు. రెండో రోజు పంట పూర్తిగా ఎర్రబడి మొక్కలన్నీ వాడిపోయాయి. రైతుకు మందు విక్రయించిన వ్యక్తి ఎలాంటి లైసెన్సు లేకుండా బిచ్కుందలో ఇంటి వద్ద మందులు పెట్టుకొని తెలిసిన రైతులకు విక్రయిస్తాడు. గంగారాం.. మందుల వ్యాపారి వద్దకు వెళ్లి నిలదీశాడు. పురుగుల కోసం ఇచ్చిన మందుతో సోయా పంట పూర్తిగా ఎర్రబడి కాలిపోయిందని తెలిపారు. ఆ వ్యక్తి పై అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఏవో అమర్ ప్రసాద్ పంట క్షేత్రానికి వెళ్లి పరిశీలించారు. నాసిరకం మందుతో పంట వాడిపోయిందని అధికారులు గుర్తించి మందు విక్రయించిన వ్యక్తిని పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేశారు. లైసెన్సు లేకుండా ఎలా విక్రయిస్తున్నావు కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆ వ్యాపారి.. పంట నష్టపరిహారం రైతుకు అందిస్తానని ఒప్పుకోవడంతో శాంతించారు. 15 రోజులు అవుతున్నా పరిహారం డబ్బులు ఇవ్వడం లేదని రైతు గంగారాం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో చిల్లి గవ్వ పరిహారం ఇవ్వనని చెబుతున్నాడని రైతు వాపోతున్నాడు. దీనిపై ఏవో అమర్ ప్రసాద్‌ను వివరణ కోరగా.. రైతుకు న్యాయం జరిగే విధంగా చూస్తామన్నారు.
ఐదారు సంవత్సరాల నుంచి మందు విక్రయించిన వ్యక్తి తెలుసు. ఆయన ఇంటి వద్ద ఉంచి మందులు విక్రయిస్తున్నారు. మంచి మందులు ఉన్నాయని నమ్మించి మోసం చేశాడు. పురుగు మందుకు బదులు నాసిరకం ఏ మందు ఇచ్చాడో తెలియదు. మూడు ఎకరాలకు కలిపి రూ.70 వేలు ఖర్చు చేశాను. పరిహారం ఇప్పించాలని కోరుతున్నాను. వ్యవసాయ అధికారులు, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. న్యాయం లభించడం లేదు.
– గంగారాం, రైతు చిన్నదడ్గి

మాడిపోయిన సోయా పంట