
అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య
భిక్కనూరు: అప్పుల బాధతో మండల కేంద్రానికి చెందిన యువకుడు మంగళవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. భిక్కనూరుకు చెందిన బండి రాజు (35) మైక్రో ఫైనాన్స్, హౌసింగ్ ఫైనాన్స్‌లో అప్పులు తీసుకున్నాడు. చెల్లించడంలో ఆలస్యం కావడంతో ఏజెంట్లు ఇబ్బందులకు గురిచేశారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురై మంగళవారం తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. మృతుడికి భార్య సుజాత, తల్లి రాధ, కుమారుడు మనోజు, కుమార్తె రిషిక ఉన్నారు.
● రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యాయత్నం
● కాపాడిన స్థానికులు
కామారెడ్డి క్రైం: ప్రేమించిన యువతి మోసం చేసిందని ఓ యువకుడు రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు వెంటనే అతడిని పట్టాలపై నుంచి పక్కకు లాగి కాపాడారు. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని డ్రైవర్స్ కాలనీకి చెందిన సచిన్ అనే యువకుడు కొంతకాలంగా బెంగళూరులో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. సెలవుపై రెండు రోజుల క్రితం కామారెడ్డికి వచ్చాడు. మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో నిజామాబాద్ నుంచి కామారెడ్డి వైపు వస్తున్న గూడ్స్ రైలు రాకను గమనించి రైల్వేగేట్‌కు కొద్దిదూరంలో పట్టాలపై తల పెట్టి పడుకున్నాడు. యువకుడు ఆత్మహత్య చేసుకోబోతున్నది గమనించిన స్థానికులు వెంటనే అతడిని పక్కకు లాగి ఆరా తీశారు. అదే కాలనీకి చెందిన ఓ యువతిని ప్రేమించాడనీ, ఆమె మోసం చేయడంతో మనస్తాపం చెందినట్లు సదరు యువకుడి బంధువులు చెబుతున్నారు. అనంతరం అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు.