
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
భిక్కనూరు: మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా పోటీ పడి సమానత్వం సాధించుకోవాలని దోమకొండ కోట ట్రస్టు మేనేజర్ బాబ్జీ అన్నారు. సౌత్‌క్యాంపస్‌లో మంగళవారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అన్నింటిలో సగభాగం అయిన మహిళలు మరింత ముందుకు వెళ్లాలన్నారు. ప్రపంచ యుద్ధ సమయంలో వివిధ దేశాలలో మహిళలు వస్తూత్పత్తి రంగంలోకి రావాల్సి వచ్చిందన్నారు. పురుషులందరూ యుద్ధంలో ఉండడంతో మహిళలే ఉత్పత్తి రంగాల్లోకి వచ్చి అధిక ఉత్పత్తి సాధించారని గుర్తు చేశారు. ఆ తర్వాత పురుషులు మహిళల నైపుణ్యాన్ని గుర్తించకపోవటంతో అనేక పోరాటాలు చేశారన్నారు. ముఖ్యంగా జర్మనీలో మొదలైన ఉద్యమం ప్రపంచ దేశాలకు పాకటంతో అప్పటి అంతర్జాతీయ సంస్థలు మహిళల హక్కులను గౌరవిస్తూ మహిళ దినోత్సవం జరపాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. ఆనాటి నుంచి మహిళ దినోత్సవం జరుపుతున్నారన్నారు. ఈ సందర్భంగా మహిళా అధ్యాపకులు, విద్యార్థినులకు పలు రకాల పోటీలను నిర్వహించారు. ప్రతిభ చూపిన వారికి బహుమతులను అందజేశారు. ప్రిన్సిపాల్ సుధాకర్‌గౌడ్, హాస్టల్ వార్డెన్ సునీత, ఏపీఆర్‌వో పిట్ల సునీత, అధ్యాపకులు పాల్గొన్నారు.