
బాధితులకు అండగా భరోసా కేంద్రం
కామారెడ్డి క్రైం: పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే భరోసా కేంద్రం ఆయా కేసుల్లో బాధితులుగా ఉన్న మహిళలు, చిన్నారులకు అండగా నిలుస్తుందని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. పోక్సో కేసుల్లో బాధితులుగా ఉన్న ఇద్దరికి ప్రభుత్వం నుంచి మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధిత మహిళలు, చిన్నారులకు భద్రత, మనోధైర్యం, న్యాయ సహకారాలు అందిస్తూ విశ్వసనీయంగా సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. అందించిన ఆర్థిక సహాయం ద్వారా బాధితులు పునరావాసం ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. విద్య, వైద్యం లాంటి అవసరాలకు ఉపయోగించుకోవాలని సూచించారు. అదనపు ఎస్పీ నరసింహా రెడ్డి, భరోసా కేంద్రం కోఆర్డినేటర్ కవిత, సిబ్బంది పాల్గొన్నారు.