
సంక్షిప్తం
బెజుగంచెరువుతండాలోనే జీపీ
భవనాన్ని నిర్మించాలి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని బెజుగంచెరువుతండాలోనే గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించాలని కోరుతూ తండావాసులు గురువారం ఎంపీడీవో ప్రభాకరచారికి వినతిపత్రాన్ని అందజేశారు.గ్రామపంచాయతీ నూతనంగా ఏర్పడినప్పటి నుంచి తమ తండాలోనే పంచాయతీ కార్యాలయం కొనసాగుతుందని వారు చెప్పారు. తమ తండాలో గల సర్వే నం.171లోనే గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించేందుకు పనులు చేపడితే ఏర్రకుంటతాండవాసులు అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. బెజుగంచెరువుతండా గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించేందుకు పలుమార్లు తండాపెద్దల సమక్షంలో మాట్లాడినా సమస్య పరిష్కారం కావడంలేదన్నారు.
ప్లకార్డులతో కాంగ్రెస్ నాయకుల నిరసన
లింగంపేట(ఎల్లారెడ్డి): లోకసభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ అరెస్టుకు నిరసనగా గురువా రం లింగంపేట అంబేడ్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోడీ దొంగ ఓట్లు వేయించుకొని గద్దెనెక్కినట్లు ఆరోపించారు. కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రామకృష్ణాగౌడ్, కాసిఫ్, రాజేశ్వర్‌గౌడ్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మహిళా సంఘాలు అన్ని విధాలా అభివృద్ధ్ది చెందాలి
తాడ్వాయి : గ్రామాలలోని మహిళా సంఘాలు అన్ని రకాల అభివృద్ధి చెందాలని సీసీ గంగారెడ్డి అన్నారు. మండలంలోని కరడ్‌పల్లి గ్రామంలో గురువారం గ్రామ సమాఖ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పొదుపు సంఘాలకు సంబందించి రికార్డులను పరిశీలించారు. ఆర్థిక లావాదేవిలపై చర్చించారు. ప్రతినెల 10వ తేదీ లోపు శ్రీనిధి, బ్యాంకు లింకేజీ రుణాలు చెల్లించేలా తీర్మానాలు చేశారు. కొత్తగా వృద్ధుల సంఘాలు, వికలాంగుల సంఘాలను ఏర్పాటు చేయాలని సూచించారు. వీవోఏలు, పొదుపు సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
ఇన్సూరెన్సు ద్వారా రక్షణ పొందాలి
ఎల్లారెడ్డిరూరల్: యువకులు 18 ఏళ్లు నిండిన తర్వాత బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని, బీమా చేయించుకోవాలని ఎస్‌బీఐ ఫీల్డ్ ఆఫీసర్ సనత్‌కుమార్ అన్నారు. గురువారం మండలంలోని మత్తమాల గ్రామంలో బ్యాంకు ఖాతాదారులకు అవగాహన కల్పించారు. ప్రతిఒక్క ఖాతాదారుడు పీఎంఎస్‌బీవై, పీఎంజేజేబీవై ఇన్సూరెన్సు చేసుకొని రక్షణ పొందాలన్నారు.

సంక్షిప్తం