
పోక్సో కేసులో ఒకరికి 20 ఏళ్ల జైలు
కామారెడ్డి క్రైం: పోక్సో కేసులో ఒకరికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కామారెడ్డి కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. వివరాలిలా ఉన్నాయి. బాన్సువాడ మండలం కొల్లూరు గ్రామానికి చెందిన కల్లూరి మహేశ్ ఓ బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడినట్లు 2021 నవంబర్ 4న కేసు నమోదైంది. మహేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన జిల్లా జడ్జి సీహెచ్‌వీఆర్‌ఆర్ వరప్రసాద్ నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.70 వేలు జరిమానా విధిస్తూ గురువారం తీర్పు వెల్లడించారు. నిందితుడికి శిక్షపడేలా కేసు విచారణ జరిపిన, సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ రాజేశ్‌చంద్ర అభినందించారు.
తప్పిపోయిన బాలిక అప్పగింత
కామారెడ్డి క్రైం: తల్లిదండ్రులను వెతుక్కుంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లి తప్పిపోయిన నాలుగేళ్ల చిన్నారిని పోలీసులు గుర్తించి తల్లికి అప్పగించారు. వివరాలు ఇలా.. జిల్లా కేంద్రంలోని ఆర్‌బీ నగర్ కాలనీలో నివాసం ఉండే కడమంచి జానకి, నరసింహులు దంపతులకు నాలుగేళ్ల కుమార్తె లాస్య ఉంది. లాస్య ఇంట్లో ఆడుకుంటుండగా దంపతులిద్దరూ ఇప్పుడే వస్తామని బయటకు వెళ్లారు. బాలిక తల్లిదండ్రులను వెతుక్కుంటూ బయటకు వెళ్లి తప్పిపోయింది. దంపతులు ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారు. పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి ఆధ్వర్యంలో సిబ్బంది సీసీ కెమెరాలు పరిశీలించడంతోపాటు ఓ పాల వ్యాపారి ఇచ్చిన సమాచారంతో బాలికను సమీపంలోని మరో కాలనీలో గుర్తించి తల్లికి అప్పగించారు. రెండు గంటల్లోనే చిన్నారి ఆచూకీ గుర్తించిన పోలీసులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.