
జడివాన జాడేది?
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : రాష్ట్రమంతటా తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. కానీ జిల్లాలో జడివాన జాడలేదు. జిల్లావ్యాప్తంగా చిరు జల్లులు కురిశాయే తప్ప ఎక్కడా భారీ వర్షాలు రికార్డు కాలేదు. జిల్లాలో ఇప్పటికీ సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. ఎనిమిది మండలాల్లో లోటు వర్షపాతమే ఉంది. పెద్దకొడప్‌గల్, పిట్లం, నిజాంసాగర్, బిచ్కుంద, మద్నూర్, జుక్కల్, ఎల్లారెడ్డి, బీబీపేట మండలాలలో భారీ లోటు వర్షపాతం ఉంది. ఆగస్టు నెలలో ఈరోజు వరకు సాధారణ వర్షపాతం 113.7 మి.మీ. నమోదు కావాల్సి ఉండగా 86.5 మి.మీ. మాత్రమే వర్షం పడింది. అంటే సాధారణంకన్నా 23 శాతం లోటు వర్షపాతం ఉంది. సీజన్ ఆరంభమైన నాటి నుంచి నేటి వరకు 502.7 మి.మీ. కురవాల్సి ఉండగా 464.2 మి.మీ. నమోదైంది. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవగా.. చాలా చోట్ల భారీ వర్షాలు కురవలేదు. వాగుల్లో ప్రవాహం మొదలైనా ఉధృతంగా ఒకటి రెండు రోజులు కూడా ప్రవహించిన దాఖలాలు లేవు. ఓ వైపు తెలంగాణలోని పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతుండగా.. కామారెడ్డి జిల్లాలో మాత్రం ఆ ఛాయలు కనిపించడం లేదు. అప్పుడప్పుడు ముసురు పెడుతుందే తప్ప భారీ వర్షం మాత్రం కురవడం లేదు. దీంతో అన్నదాతలు నిరాశ చెందుతున్నారు.
జిల్లా అంతటా చిరుజల్లులే తప్ప
భారీ వర్షాల్లేవ్
ఇప్పటికీ ఎనిమిది మండలాల్లో
లోటు వర్షపాతమే..
కల్యాణి ప్రాజెక్టులోకి 210 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
ఎల్లారెడ్డిరూరల్: తిమ్మారెడ్డి గ్రామ శివారులోని కల్యాణి ప్రాజెక్టులోకి బుధవారం 210 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఈ నీటిని నిజాంసాగర్ మెయిన్ కెనాల్‌లోకి మళ్లిస్తున్నామన్నారు.