
పొడిగింపా.. ప్రత్యేకాధికారుల పాలనా?
నాగిరెడ్డిపేట: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గాల పదవీకాలం గురువారంతో ముగియనుంది. అయితే పాలకవర్గాల గడువు మరోమారు పొడిగిస్తారా లేక ప్రత్యేకాధికారులను నియమిస్తారా అన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు.
జిల్లాలో మొత్తం 55 సహకార సంఘాలున్నాయి. వీటిలో 1.55 లక్షల మంది రైతులు సభ్యత్వం కలిగి ఉన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు 2019 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పాలకవర్గాల పదవీ కాలాన్ని ఆరు నెలలపాటు పొడిగించారు. ఆ గడువు కూడా ఈనెల 14తో పూర్తికానుంది. ఈ నేపథ్యంలో సహకార సంఘాల పాలక వర్గాలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠ నెలకొంది. పదవీ కాలం ముగుస్తుండడం, గడువు పొడిగింపుపై ఎలాంటి ప్రకటన రాకపోవడంతో స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎవరు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారన్న అంశంపై చర్చ నడుస్తోంది.
నేటితో ముగియనున్న సహకార
సంఘాల పాలకవర్గాల పదవీకాలం
స్పష్టత ఇవ్వని సర్కారు
ఎలాంటి సమాచారం లేదు..
సహకార సంఘాల పాలక వర్గాల పదవీకాలం గురువారంతో ముగియనుంది. పాలకవర్గాల గడువు పొడిగిస్తారా, లేదా అన్నది ప్రభుత్వ పరిధిలోని అంశం. దీనిపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు.
– రామ్మోహన్, డీసీవో, కామారెడ్డి