
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
కామారెడ్డి క్రైం: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రారంభించి ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాదక ద్రవ్యాలతో కలిగే దుష్ప్రభావాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలామంది యువకులు గంజాయి, కల్తీ కల్లు, మద్యం, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని కట్టడి చేయడానికి జిల్లా సంక్షేమ శాఖ, ఎకై ్సజ్ శాఖల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ విజయ్, జిల్లా సంక్షేమ ఆధికారి ప్రమీల, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.