
దరఖాస్తు లేకుండానే కుల ధ్రువీకరణ పత్రం
● నూతన విధానాన్ని అమలులోకి
తెచ్చిన ప్రభుత్వం
● హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు
● అవగాహన కల్పించని అధికారులు
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): కుల ధ్రువీకరణ పత్రాల జారీలో రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది. మీసేవ నుంచి పత్రాన్ని పొందిన వ్యక్తి మరోసారి దరఖాస్తు చేసే వెసులుబాటు గతంలో ఉండేది. కులం మారదు కనుక ఇప్పుడు అలాంటి విధానానికి స్వస్తి పలకడంతోపాటు ప్రభుత్వం నూతన విధానాన్ని అమలులోకి తెచ్చింది. కుల ధ్రువీకరణపత్రం గతంలో ‘కమ్యూనిటీ డేట్ ఆఫ్ బర్త్’ గా వచ్చేది. దీంతోపాటు ఆధార్ కార్డు ప్రకారం పుట్టిన తేదీ వివరాలు వచ్చేవి. ప్రస్తుతం కుల ధ్రువీకరణ పత్రంలో జనన వివరాలు అవసరం లేదని ప్రభుత్వం గుర్తించింది. పత్రంలో ఈ వివరాలను తొలగించి కేవలం ‘కమ్యూనిటీ’ పేరుతోనే నూతన పత్రాన్ని జారీ చేస్తోంది. కొత్త విధానంతో ధ్రువపత్రాలు పొందడానికి క్షణాల్లో పని పూర్తయితే బాగానే ఉంటుంది. కానీ, గతంలో పొందిన కుల ధ్రువపత్రాల్లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని మార్చుకునే వెసులుబాటు లేదు.
ఎస్సీ వర్గానికి వర్తించదు..
కుల ధ్రువీకరణ పత్రం జారీలో అన్ని సామాజిక వర్గాలకు పాత ధ్రువపత్రం చూపిస్తే అప్పటికప్పుడు కుల ధ్రువీకరణ పత్రం జారీ కానుండగా ఎస్సీ సామాజిక వర్గానికి మాత్రం వర్తించదని అధికారులు చెబుతున్నారు. వారు కొత్తగా దరఖాస్తు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.
ప్రచారం కరువు..
నూతన విధానంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాల్సిన అధికార యంత్రాంగం ప్రేక్షకపాత్ర పోషిస్తోంది. నూతన మార్పులను పత్రికా ప్రకటనల ద్వారా ప్రజలకు తెలపాల్సి ఉండగా తదనుగుణ చర్యలు లేకపోవడం గమనార్హం. కొత్త విధానంలో కులధ్రువీకరణ పత్రం ఎలా తీసుకోవాలో తెలియక చాలామంది పాత విధానాన్నే అనుసరిస్తూ సమయంతోపాటు డబ్బు వృథా చేసుకుంటున్నారు. ఈ విషయమై రెవెన్యూ అధికారులను సంప్రదించగా ప్రభుత్వం నుంచి ఇంకా గైడ్‌లైన్స్ రాలేదని రాగానే ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు.
పాత సర్టిఫికెట్ చూపిస్తే సరి..
ఇక మీదట ప్రతిసారి కుల ధ్రువీకరణ పత్రం పొందడానికి దరఖాస్తు చేయాల్సిన పని లేదు. పాత ధ్రువీకరణ పత్రంలోని నంబర్ లేదా ఆధార్ ద్వారా అప్పటికప్పుడు మీసేవలో సర్టిఫికెట్ తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దీంతో విద్యార్థులు, ఇతరత్రా వారికి సేవలు సులభతరం కానున్నాయి. గతంలో మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకొని, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, నాయబ్ తహసీల్దార్, తహసీల్దార్ ఆమోదం పొందిన తర్వాత కుల ధ్రువీకరణ పత్రం తీసుకోవాల్సి వచ్చేది. ఈ ప్రక్రియకు కనీసం పక్షం రోజులు సమయం పట్టేది. కొత్త విధానంలో భాగంగా పాత సర్టిఫికెట్ చూయించి వెంటనే కొత్త సర్టిఫికెట్ పొందే అవకాశం కల్పించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.