
మంజూరు 99.. ప్రారంభం 12
పిట్లం(జుక్కల్): పేదలకు ఇళ్లు ఇవ్వాలన్న ఉదేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశ పెట్టింది. ఈ పథకంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే వారికి విడతల వారీగా మొత్తం రూ. 5 లక్షలు అందజేస్తుంది. పిట్లం మండలంలో ఇళ్ల నిర్మాణాకి ముందుకు రావడం లేదు. మండలంలోని హోస్నపూర్ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి 99 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 12 మంది లబ్ధిదారులు మాత్రమే ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించగా, అందులో ఆరుగురు మాత్రమే చురుకుగా పనులు చేసుకోవడంతో వారికి మొదటి విడత రూ.లక్ష చొప్పున బిల్లులు అందజేశారు. ఇందులో 49 మంది లబ్ధిదారులు పంటలు వచ్చాక, కొంత మంది, దసర, దీపావళి పండుగల తర్వాత నిర్మాణాలు సుముఖంగా ఉన్నారు. మిగిలిన 38 మంది ఇళ్ల వద్దని రాతపూర్వకంగా రాసి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. పిట్లం మండలంలో 423 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయి. అందులో 138 మంది లబ్ధిదారులు కట్టుకుంటామని ముందుకు వచ్చి ముగ్గు పోశారు. అందులో 50 మంది లబ్ధిదారులు చురుకుగా పనులు చేసుకొవడంతో వారికి మొదటి విడత రూ. లక్ష చొప్పున బిల్లులు అందజేశారు. మిగితా 285 మంది లబ్ధిదారులు ఇంకా పనులు ప్రారంభించలేదు. అధికారులు, ప్రజా ప్రతినిధులు లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తే ఇళ్ల నిర్మాణంలో వేగం పెరిగే అవకాశం ఉంది.
ఇందిరమ్మ ఇళ్ల పైలట్ గ్రామం
హోస్నపూర్‌లో పరిస్థితి
పిట్లం మండలంలో ఇళ్ల నిర్మాణానికి ముందుకు రాని లబ్ధిదారులు
ఇళ్లు నిర్మించుకోవాలి
ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించుకోవాలని సూచిస్తున్నాం. ఇళ్లు కట్టుకునే వారికి విడతల వారీగా బిల్లులు చెల్లిస్తున్నాం. అయిన కొంత మంది లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. కొందరు పంటల తర్వాత, పండగల తర్వాత కట్టుకుంటామని అంటున్నారు.
– రఘు, ఎంపీడీవో, పిట్లం