
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
ఎల్లారెడ్డిరూరల్/బాన్సువాడ రూరల్/మద్నూర్/నస్రుల్లాబాద్/ సదాశివనగర్ : ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా బుధవారం కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేశారు. ఈసందర్భంగా ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ మాట్లాడారు.డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం విద్యార్థులు పాటుపడాలని శ్రీరాం నారాయణ ఖేడియా ప్రభుత్వ డిగ్రీకళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ గులాం ముస్తఫా అన్నారు. రాష్ట్ర యాంటి నార్కోటిక్ బ్యూరో ఆదేశానుసారం కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ 1,3 ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిరోధక అవగాహన సదస్సు నిర్వహించి మాట్లాడారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. బాన్సువాడ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు ఆధ్వర్యంలో కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది నషాముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేశారు. మద్నూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి వెంకట్ మాట్లాడుతు మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియశీల భాగస్వామిని అవుతానని పేర్కొన్నారు. బీబీపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో అధ్యాపకులు నషాముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేయించారు. నస్రుల్లాబాద్ మండలం నెమ్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో సైబర్ నేరాలు, ఫోక్సో కేసుల తదితర వాటిపై షీ టీం కానిస్టేబుల్ అనిల్ కుమార్ అవగాహన కల్పించారు.యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పారా లీగల్ వలంటీర్ మఠం విజయ్ కుమార్ సూచించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఎలా ఉండాలనే విషయాలను తెలియజేసే వాల్ పోస్టర్లను సదాశివనగర్ ఎస్సై పుష్పరాజ్ చేతుల మీదుగా మర్కల్ చౌరస్తా వద్ద ఆవిష్కరించారు. అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.