
చికిత్స పొందుతూ కేజీబీవీ విద్యార్థిని మృతి
నిజామాబాద్‌నాగారం/ఆర్మూర్: తీవ్రగాయాలతో ప్రగతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేజీబీవీ విద్యార్థిని కావేరి(16) బుధవారం ఉదయం మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని దుబ్బకు చెందిన కావేరి ఆర్మూర్ పట్టణంపెర్కిట్‌లో ఉన్న కేజీబీవీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నెల 5న అర్ధరాత్రి కేజీబీవీ భవనం నుంచి కావేరి కిందకు దూకింది. తలకు తీవ్రగాయాలు కావడంతో కేకలు వేసింది. స్పందించిన కేజీబీవీ సిబ్బంది వెంటనే స్థానికంగా ఉన్న ఎంజే ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని ప్రగతి ఆస్పత్రికి తరలించారు. వారం రోజులుగా చికిత్స పొందిన కావేరి బుధవారం ఉదయం 8.40 నిమిషాల సమయంలో మరణించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు.
కోతులకు భయపడే..
కావేరి ఈ నెల 5న తెల్లవారుజామున హాస్టల్‌లోని వాష్‌రూంకు వెళ్లి వస్తుండగా కోతులు వెంటపడడంతో భయపడి హాస్టల్ పోర్టువాల్ ఎక్కి కిందకు దూకినట్లు కేజీబీవీ అధికారులు తెలిపారు. తలకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కాగా, కావేరి తండ్రి గణేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్మూర్ పోలీసులు తెలిపారు.
చికిత్స పొందుతూ యువకుడు..
రామారెడ్డి: ఆర్థిక ఇబ్బందులతో గడ్డి మందు తాగిన ఓ యువకుడు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు రామారెడ్డి ఎస్సై లావణ్య తెలిపారు. రామారెడ్డికి చెందిన పోగుల నాగరాజు (37) కొంతకాలంగా మద్యం, పేకాటకు బానిసయ్యాడు. దురలవాట్లతో అప్పులు కావడంతో మానసిక ఒత్తిడికి గురై ఈ నెల 1న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. 9న గుర్తుతెలియని గడ్డి మందు తాగిన నాగరాజును కుటుంబసభ్యులు గుర్తించారు. వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి భార్య సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి కొడుకు, కూతురు ఉన్నారు.