
శరీరంలో ప్రధానమైన అవయవాలు
స్పందిస్తున్న హృదయాలు
అవయవదానంతో నిలుస్తున్న ప్రాణాలు
ఒకరి దానంతో నలుగురి జీవితాల్లో వెలుగులు
నేడు ప్రపంచ అవయవదాన దినోత్సవం
శరీరంలో ప్రధానమైన గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం వంటి అవయవాలు దెబ్బతిని ఎంతోమంది ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అవయవ మార్పిడి జరగక ఎన్నో జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోతున్నాయి. అయితే బ్రెయిన్ డెడ్‌కు గురైన వారి నుంచి అవయవాలను సేకరించి అలాంటి వారికి అమర్చడం ద్వారా ప్రాణాలను నిలిపే అవకాశాలున్నాయి. జిల్లాలో పలువురు బ్రెయిన్‌డెడ్ కాగా.. వారి కుటుంబ సభ్యులు అవయవాలను దానం చేసి ఎన్నో ప్రాణాలను నిలిపారు.
సాక్షి ప్రతినిధి కామారెడ్డి : తమ ఇంటిదీపం ఆరిపోతోందని ఆందోళన చెందుతున్న కుటుంబాల్లో అవయవదాతలు వెలుగులు నింపుతున్నారు. మృత్యు అంచుల్లో ఉన్న వారిలో జీవకళ తెస్తున్నారు. తమ శరీరంలో దెబ్బతిన్న అవయవాల స్థానంలో ఇతరుల నుంచి సేకరించిన వాటిని అమర్చడంతో మృత్యువు దగ్గరిదాకా వెళ్లిన వారు సాధారణ జీవనం సాగిస్తున్నారు. చాలా వరకు రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారిలో మెదడు పనిచేయదు. దీనిని వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా పరిగణిస్తా రు. బ్రెయిన్ డెడ్ అయినా ఆ వ్యక్తి శరీరంలోని గుండె, కిడ్నీలు, కళ్లు, ఊపిరితిత్తులు, కాలేయం వంటి అవయవాలు పనిచేస్తాయి. కు టుంబ సభ్యుల అంగీకారంతోనే వైద్యులు అవయవాలను సేకరిస్తున్నారు. వాటిని అవసరమైన వారికి అమర్చి పునర్జన్మ ఇస్తున్నారు. బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించిన గుండె, ఊపిరితిత్తులను నాలుగు గంటలలోపు, కాలేయాన్ని 12 గంటలలోపు, కిడ్నీలను 48 గంటల్లోపూ ఇతరులకు అమర్చాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో బాధితుడి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి, బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి శరీరం నుంచి ఆయా అవయవాలను సేకరించి ఇతరులకు అమర్చడం ద్వారా నలుగురికి ఊపిరి పోస్తున్నారు వైద్యులు.
జిల్లాలో ఇరవై మందికిపైగా...
జిల్లాలో అవయవదానంపై అవగాహన పెరుగుతోంది. పదేళ్ల కాలంలో బ్రెయిన్ డెడ్ అయిన ఇరవై మందికిపైగా అవయవాలను దానం చేశారు. వారి కుటుంబ సభ్యుల ఆమోదం మేరకు అవయవాలను సేకరించి అవసరం ఉన్న రోగులకు అమర్చడం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి పునర్జన్మ ప్రసాదించారు. జీవన్‌దాన్ సంస్థ అవయవదానంపై అవగాహన కల్పించడంతో పాటు బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తుల కుటుంబ సభ్యులను ఒప్పించి అవయవాలను దానం చేయడానికి సహకరిస్తోంది. జిల్లాలోనూ అవయవదానంపై వివిధ సంఘాలు అవగాహన కల్పిస్తున్నాయి.