
పోచారం ప్రాజెక్టుకు జలకళ
నాగిరెడ్డిపేట : పోచారం ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో వరదనీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టులో నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతూ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువయ్యింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 21.5 అడుగులు(1.820 టీఎంసీలు) కాగా మంగళవారం సాయంత్రానికి 20 అడుగుల (1.682 టీఎంసీ) నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి వచ్చి చేరిన నీరు ఆయకట్టు పరిధిలో వానాకాలం పంటల సాగుకు సరిపోతుందని రైతులు పేర్కొంటున్నారు.
అధికారుల్లో నిశ్చింత..
పోచారం ప్రాజెక్టు నుంచి ఆయకట్టు కోసం ఈనెల ఆరో తేదీన ప్రధాన కాలువలోకి నీటిని విడుదల చేశారు. ఆ సమయంలో ప్రాజెక్టులో 17 అడుగులతో 1.244 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అయితే సరైన వర్షాలు లేకపోవడం, ఆయకట్టు పరిధిలోని చెరువులు, కుంటలు ఖాళీగా ఉండడం, కాలువలు సైతం పొదలతో అధ్వానంగా ఉండడంతో చివరి ఆయకట్టు వరకు నీటిని అందించడం అధికారులకు ఇబ్బందిగా మారింది. ప్రాజెక్టులో ఉన్న నీటితో ఆయకట్టును చివరి వరకు గట్టెక్కించడం కష్టమన్న అభిప్రాయం వ్యక్తమయ్యింది. కానీ వారం రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టు నీటిమట్టం పెరగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఉన్న నీటితో వానాకాలం పంటలకు పూర్తి స్థాయిలో నీరందించవచ్చని పేర్కొంటున్నారు.
పూర్తిస్థాయి నీటిమట్టానికి
చేరువలో జలాశయం
వానాకాలం పంటల సాగుకు
పూర్తి భరోసా