
ఇంటిపై కూలిన భారీ మర్రిచెట్టు
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని మెంగారం గ్రామంలో సోమవారం రోడ్డు పక్కనే ఉన్న ఇంటిపై భారీ మర్రిచెట్టు కూలినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు నేల మెత్తబడడంతో మర్రిచెట్టు నేల వాలినట్లు తెలిపారు. దీంతో గ్రామానికి చెందిన ఎంకనోళ్ల ఎంకవ్వ ఇళ్లు కూలిపోయింది. అధికారులు స్పందించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలని బాధితురాలు కోరింది.
బైక్ పైనుంచి పడి యువకుడికి తీవ్రగాయాలు
పిట్లం(జుక్కల్): బైక్‌పై నుంచి పడి యువకుడికి తీవ్రగాయాలైన ఘటన మండలంలోని మద్దెలచెరువు గ్రామ సమీపంలో పిట్లం– బాన్సువాడ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామానికి చెందిన యువకుడు బైకుపై పిట్లం నుంచి బాన్సువాడ వైపు వెళ్తుండగా మద్దెల చెరువు సమీపంలో అదుపు తప్పి కిందపడిపోయాడు. యువకుడికి తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మూడున్నర తులాల బంగారం చోరీ
మోపాల్: మండలంలోని గుడి తండాకు చెందిన రత్నావత్ గంగా అలియాస్ హారిక ఇంట్లో నుంచి మూడున్నర తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు ఎస్సై జాడె సుస్మిత సోమవారం తెలిపారు. గత నెల 27న కుమారుడి జన్మదినం సందర్భంగా బంగారు ఆభరణాలు ధరించారు. తిరిగి ఎప్పటిలాగే బీరువాలో దాచిపెట్టారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా 8న బీరువా తెరిచి చూడగా, బంగారు ఆభరణాలు కన్పించలేదు. ఇంట్లో అంతా వెతికినా లభించకపోవడంతో చోరీకి గురైనట్లు నిర్ధారణకు వచ్చిన హారిక సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఇంటిపై కూలిన భారీ మర్రిచెట్టు