
సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలి
కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 63 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో ప్రధానంగా భూ సంబంధిత రెవెన్యూ ఫిర్యాదులు, ఫించన్‌లు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఫిర్యాదులు పెండింగ్‌లో లేకుండా చూసుకోవాలన్నారు. తీసుకున్న చర్యల వివరాలను దరఖాస్తుదారునికి తెలియపర్చాలని అధికారులకు సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్, కలెక్టరేట్ ఏవో మసూర్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.
డీపీఎం, ఏపీఎంలపై చర్యలు తీసుకోవాలి
ఐకేపీ డీపీఎం రవీందర్, ఏపీఎం ప్రసన్న కుమార్‌లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామ సంఘం సమన్వయకర్త (వీవోఏ) లక్ష్మీనర్సవ్వ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఆమె మాట్లాడుతూ.. తాను చాలా కాలంగా రెడ్డిపేట వీవోఏగా పని చేస్తున్నానని అన్నారు. 2024 అక్టోబర్‌లో రెడ్డిపేట డ్వాక్రా మహిళా సంఘాలలో అక్రమాలు జరిగాయని కొందరు అకారణంగా ఫిర్యాదులు చేయడంతో తనను విధుల నుంచి తొలగించారని తెలిపారు. గ్రామంలో ఉన్న అన్ని సంఘాలలో ఆడిట్ చేయించగా తాను ఎలాంటి తప్పు చేయలేదని తేలిందన్నారు. అయినప్పటికీ సంఘాల తరఫున రూ.80 వేలు సీ్త్రనిధి డబ్బులను తన చేత కట్టించారన్నారు. 9 నెలలు దాటినా ఇప్పటికీ లెక్కలు చేయించడం లేదనీ, విధుల్లోకి తీసుకోవడం లేదని వాపోయారు. సంబంధిత డీపీఎం, ఏపీఎంలపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు.
గురుకులానికి సొంత భవనం నిర్మించాలి
కామారెడ్డి అర్బన్: లింగంపేటకు 2016లో మంజూరైన సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలకు ఐదు ఎకరాల స్థలం కేటాయించినా, ఇప్పటికీ పక్కా భవనం నిర్మించడం లేదని, వెంటనే భవనం నిర్మించాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు హరిలాల్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. లింగంపేటలో పక్కా భవనం లేనందున గత 9 సంవత్సరాలుగా వివిధ ప్రాంతాల్లో అద్దె భవనాల్లో నడుపుతున్నారన్నారు. వెంటనే నిధులు మంజూరు చేసి లింగంపేటలో భవన నిర్మాణం చేపట్టాలని కోరారు.
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
ప్రజావాణిలో 63 ఫిర్యాదుల స్వీకరణ