
కలుషితమవుతున్న మత్తడి వాగు నీరు
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన రైస్ మిల్లుల నుంచి వెలువడుతున్న వ్యర్థ పదార్థాలను అటవీ ప్రాంతంలో ఉన్న వాగులోకి వదిలేస్తున్నారు. బాయిల్డ్ మిల్లు నుంచి వెలువడుతున్న వ్యర్థ పదార్థాలను నేరుగా ఒక కాలువ ద్వారా వాగులోకి వదులుతున్నారు. మిల్లుల నుంచి వెలువడుతున్న కలుషిత నీటితో ఆ ప్రాంతంలో ఉన్న పంట భూముల్లో సైతం కలుషిత నీరు పారుతుందని రైతులు వాపోతున్నారు. మిల్లులు ప్రారంభం కాక ముందు ఇంతలా వ్యర్థపు నీరు వదలలేదని, గత ఏడాది కాలంగా భారీగా వ్యర్థపు నీటిని వదులుతున్నారని ఆ ప్రాంత రైతులు పేర్కొంటున్నారు. మిల్లుల నుంచి వెలువడుతున్న వ్యర్థాలను అరికట్టాలని గతంలో ప్రజావాణిలో సైతం ఫిర్యాదులు ఇచ్చిన ఎలాంటి స్పందన లేదని రైతులు చెబుతున్నారు. ఈకలుషిత నీటిని తాగిన పశువులు రోగాల బారిన పడుతున్నాయని పశువుల కాపరులు చెబుతున్నారు. గతంలో అటవీ ప్రాంతంలో కేవలం మత్తడి వద్ద పుష్కలమైన నీరు లభించేదని, ఇప్పుడు నీరు వ్యర్థాలతో ప్రమాదకరంగా ఉందన్నారు. కాలుష్య నియంత్రణ అధికారులు దృష్టి సారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మిల్లుల నుంచి వెలువడుతున్న వ్యర్థాపు నీటిని అరికట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
బాయిల్డ్ రైస్‌మిల్లుల నుంచి వెలువడుతున్న వ్యర్థాలు కాలువద్వారా వాగులోకి..
నీరు తాగి రోగాల బారిన
పడుతున్న పశువులు