
రోడ్లపై నిలుస్తోన్న వాన నీరు
● కేకేవై రహదారిలో వాహనదారులకు ఇబ్బందులు
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి పట్టణం గుండా వెళ్లే కేకేవై (కరీంనగర్–కామారెడ్డి–ఎల్లారెడ్డి) వంద ఫీట్ల రోడ్డు కబ్జాలతో ఇరుకుగా మారి ఓవైపు వాహనాదా రులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈ దారిలో డ్రెయినేజీ లేకపోవడంతో వర్షం కురిస్తే రోడ్డుపైనే నీరు నిలిచి మరిన్ని అవస్థలు పడాల్సి వస్తోంది. వంద ఫీట్ల కేకేవై రోడ్డు పట్టణంలో సిరిసిల్లరోడ్డు, స్టేషన్‌రోడ్డు, పోలీసు స్టేషన్, రైల్వే బ్రిడ్జి మీదుగా ఉంది. ఈ రోడ్డులో ఎక్కడికక్కడ అక్రమ కట్టడాలతో కబ్జా చేశారు. సిరిసిల్ల రోడ్డులో రామేశ్వరపల్లి వెళ్లే జాతీయ రహదారి సర్వీసు రోడ్డు సైతం ఇలాగే వాన నీటితో నిండిపోయింది. జాతీయ రహదారి నిర్వాహకులు మూసుకుపోయిన మురికికాల్వల్లో మట్టిని తొలగించకపోవడంతో నీరు రోడ్డుపై నిలుస్తోంది. ఉన్నతాధికారులు స్పందించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.