
రైతు బీమాకు వేళాయె..
కామారెడ్డి క్రైం: ఇంటికి పెద్ద దిక్కయిన రైతు ఏదైనా కారణంతో చనిపోతే ఆ కుటుంబం వీధిన పడకుండా ఆదుకునేందుకు ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని అమలు చేస్తోంది. ప్రతి ఏడాది పథకం కాలపరిమితి ఆగస్టు 14వ తేదీతో ముగుస్తుంది. వచ్చే ఏడాది (2025–26) కాలానికి గాను రైతు బీమా పఽథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను శనివారం విడుదల చేసింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఉన్న రైతుల జాబితాతోపాటు జూన్ 5వ తేదీ వరకు భూ భారతి పోర్టల్ ద్వారా కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన రైతులు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. అర్హులైన రైతులు ఈ నెల 13వ తేదీ లోగా తమ వివరాలతో సంబంధిత ఏఈవోలను సంప్రదించి నమోదు చేసుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
జిల్లాలో 1.90 లక్షల మంది రైతులు
రైతు తరఫున ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తూ పథకాన్ని అమలు చేస్తోంది. 18 నుంచి 59 ఏళ్ల వయస్సున్న రైతులు ఈ పథకానికి అర్హులు. జిల్లాలో మొత్తం 3.14 లక్షల మంది రైతులు ఉండగా, వారిలో గతేడాది 1.90 లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించి పథకంలో భాగస్వామ్యం చేశారు. వారిలో 1,117 మంది రైతులు వివిధ కారణాలతో చనిపోగా, రైతు బీమా కింద ఆయా కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందింది. ఈ సారి పథకానికి అర్హులైన రైతుల సంఖ్యలో కొద్దిపాటి మార్పులు వచ్చే అవకాశం ఉంది.
ప్రీమియం చెల్లిస్తున్న ప్రభుత్వం
ప్రభుత్వం రైతుబీమా పథకం అమలు కోసం గతేడాది ఎల్‌ఐసీ సంస్ధతో ఒప్పందం చేసుకుని ఒక్కో రైతు తరఫున రూ.2,700 ప్రీమియం చెల్లించి పథకాన్ని అమలు చేసింది. ఈ ఏడాది ప్రీమియంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన (జూన్ 5 లోపు) రైతులు ఈ నెల 13 లోగా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్, నామినీ ఆధార్ కార్డుతో సంబంధిత ఏఈవోలను సంప్రదించాలి. జిల్లాలో అర్హులైన రైతులందరినీ పఽథకంలో భాగస్వామ్యం చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.
అర్హులైన రైతులందరికీ వర్తింపు
జిల్లాలో 3.14 లక్షల మంది రైతులు ఉన్నారు. ప్రస్తుతం రైతుబీమా పథకంలో 1.90 మంది రైతులు అర్హులుగా ఉన్నారు. కొత్త రైతులు 13 లోగా దరఖాస్తులు అందజేయాలి. అర్హులందరినీ పథకంలో భాగస్వాములను చేస్తాం. 59 ఏళ్ల లోపు వారికే పథకం వర్తిస్తుంది.
– మోహన్‌రెడ్డి, డీఏవో, కామారెడ్డి
జూన్ 5 నాటికి పట్టాపాస్‌పుస్తకాలు
పొందిన రైతులకు అవకాశం
ఈ నెల 13వ తేదీలోగా నమోదు చేసుకోవాలి
మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం

రైతు బీమాకు వేళాయె..