
నిండుకుండలా పెద్ద చెరువు
కామారెడ్డి అర్బన్: జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణానికి ప్రధాన నీటివనరుగా ఉన్న వారసత్వ పెద్ద చెరువు ఎట్టకేలకు నిండుకుండలా మారుతోంది. దీంతో పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శనివారం పౌర్ణమి కావడంతో చెరువులో ఎలాంటి అలలు లేకుండా కదలకుండా నిండుగా కనిపించడం ఆకట్టుకుంది. చెరువు కింద సేద్యం లేకున్నప్పటికీ బోరుబావులు, పాత పట్టణానికి నీరందించడం, మత్స్యకారుల ఉపాధి కోసం చేపల పెంపకం, పశువులకు నీరు, భూగర్భజలాల వృద్ధికి పెద్ద చెరువు ప్రధాన ఆధారంగా ఉంది. చెరువు పైభాగంలోని ఉమ్మడి తాడ్వాయి మండలంలో గత మూడునాలుగు రోజులుగా భారీ వర్షాలు కురవడంతో గుండమ్మవాగు ద్వారా భారీగా వరద చేరుతోంది. చెరువు అలుగు పారడానికి అరఫీటు నీరు అవసరంగా కాగా.. రెండుమూడురోజుల్లో పూర్తిగా నిండుతుందని ప్రజలు అంటున్నారు.